తిరుప్పావై Download pdf for parayana

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి
అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

తిరుప్పావై

జైశ్రీమన్నారాయణ!

సంస్కృత సాహిత్యములో కాళిదాస మహాకవికి చాలా గొప్ప స్థానమున్నది. ఆయన ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చి చెప్పుటలో ననగ ‘ఉపమానములను’ ప్రయోగించుటలో సిద్దహస్తుడని ‘ఉపమాకాళిదాసస్య’ అని అంటారు. ఆతనిని మించి ఉపమానములను ప్రయోగించు సామర్థ్యము ఇతరులకు లేదందురు. ఇతర భాషలకునూ లేదందురు.

ద్రావిడ సాహిత్యములో ఆళ్వార్లు గానము చేసిన దివ్యప్రబంధమునకు ఒక విశిష్టమగు స్థానమున్నది. అందులో ప్రతిపాదింపబడిన విషయమగు భగవానుని వలన దానికా గౌరవము సిద్ధించినది. ఆ భగవానుని పొందుటకు ఆ భగవానుని చేతనే మేల్కొలుపబడి, వానిని దర్శించినవారు ఆళ్వార్లు. ఆ దర్శన జనితానందమే పరీవాహమై బయల వెడలగ అది సాక్షాత్తు భగవానుని చేతనే కలిగింపబడినదగుట వలన యథార్థార్థ ప్రతిపాదకమై, భగవత్తత్వమును మన ఎదుట, మన హృదయమున ఆవిష్కరింపదగినదై ఉన్నది. ఆ ఆనందపు పరీవాహమై దివ్య ప్రబంధములు.

ఆ ఆళ్వార్లలో అన్యతమమై, భగవానునిచే తాను లేపబడుట కాక జీవులను మరచి నిదురించిన ఆ భగవానుని తాను స్వయముగ మేల్కొలిపి, అతడు మరచిన విషయమాతనికి పాఠముగ నేర్పి, తన మాలికతో యాతని బంధించి, నిర్భంధముగ అతనిని పొందెడి భాగ్యమును పొందినది ‘శ్రీ ఆండాళ్!’. భగవానుని పురుషోత్తమునిగ ఎఱింగి, తమను నాయికగ ‘భావన’ చేయుచు ఆళ్వార్లు దివ్యశృంగార రసానుభూతి నందిరి. కాని మన ‘శ్రీ ఆండాళ్ళు’కు తనయందు నాయికాభావ మారోపించుకొనెడి అవసరమే లేక సహజముగ స్త్రీయగుటచే బాహ్య, అంతరములందు నాయికత్వపూర్తి కలిగి పురుషోత్తముని విషయమున సహజముగనే తన ప్రేమను ఆవిష్కరించు రెండు ప్రబంధములను పాడెడి భాగ్యమబ్బినది. అవి నాచ్చియార్ తిరుమెళి, తిరుప్పావై. యివి రెండునూ దివ్యశృంగార రసానుభూతులొలకించు ప్రబంధ రాజములు మిగిలిన ప్రబంధముల కంటే సహజమగు భగవత్ర్పేమ నావిష్కరించునవి ఇవి రెండునూ. ఈ రెంటిలోనూ వ్యంగ్యార్థ ప్రధానమగు తిరుప్పావై, సకల వేద బీజభూతమై, అత్యుత్తమై కావ్యరాజమై సర్వరసములొలకించుచున్నదని పెద్దలు నిరూపించిరి.

ఏ యితర ఆధ్యాత్మిక గ్రంథముగాని, సాహిత్యగ్రంథముగాని ఈ తిరుప్పావైతో సాటిరావని నిర్ణయించిరి. సంస్క్రత సాహిత్యమున తన ఉపమా ప్రయోగములచే పేరెన్నికగన్న కాళిదాసుకంటెను ఉత్కృష్టతమములగు ఉపమానములను ప్రయోగించుచు మన శ్రీ ఆండాళ్ తల్లి అగ్రస్థానమున నిలచినది. ఉదాహరణకు కేశపాశమును కవులు అనేక తెలగుల వర్ణించిరి ఇతర సాహిత్యాది గ్రంథములలో. అదే స్త్రీ కేశపాశ సౌందర్యమును మన ఆండాళ్ వర్ణించిన తీరు అద్భుతము. ఇంతవరకెవ్వరికినీ అది తోచనయినలేదట. ఆమెకు సహజ స్త్రీత్వ, సౌందర్యదర్శనములున్నవి గనుకనే ఆమె యిట్లు చెప్పగల్గినదని తేల్చిరి. ఏమని? కారడవిలో, ఏ భయమెఱుంగక, బాగ పెరిగిన పురికల నెమలి మేఘోదయము కాగానే పురివిప్పి నాట్యమాడునపుడు ఆ సౌందర్యమేమని వర్ణింతుము, సహజ స్త్రీత్వ పూర్తి కలవారి కేశపాశములారీతిని ఆకర్షకములై యుండునని, ఎంత రమణీయముగ మన అమ్మ వర్ణించినదో! ఇట్లెవ్వరూ చెప్పలేదు. అట్లే పురుషాకర్షకమగు నితంబమును అభివర్ణించుచు ఎందరో ఎన్నో ఉపమానములను చెప్పిరిగాని మన అమ్మ చూపిన ఉపమానము అనన్యసామాన్యము. నిర్భయముగ తన స్థానమున పుట్ట యుందుండి దేహమును ముడచి దాని పై తన పడగను విప్పి కప్పినపుడెట్లు ఆ పడగ అందముగ ప్రకాశించునో అట్టిదా జఘన సౌందర్యము అని ఒక గోపిక నుద్దేశించిన ఉపమానములు లోకోత్తరములు. ఇట్టి ననేక ఉపమానములు సంస్కృత సాహిత్యమునగూడ లేనివి, సహజమైనవి, సౌందర్యమున కాకరములుగ, శృంగారమున కాయవుపట్టుగ వర్ణించిన తిరుప్పావైకు సాటియగు సాహిత్య గ్రంథము మరి యే యితర సాహిత్యమునగాని ద్రావిడ భాషయందు గాని లేనేలేదని, ఆత్మోద్ధరణకు గూడ ఇవియే సాధనమని మన పెద్దలు నిర్ణియించిరి.

సౌందర్యము నుపాసించుట, శృంగారమును ఉపాసించుట యనెడివి భగవత్సంబంధము లేనిచో తుచ్ఛములని అది కలిగి తద్విషయమున సాగుటయే తగినదని శ్రీ ఆండాళ్ ‘తిరుప్పావై’ నందాదియుండి అంతము వరకు నిర్ధారణ చేసినది.

ఇంత గొప్పతనము కల్గిన ప్రబంధ రాజమును అనుసంధించియే శ్రీ భగవద్ రామానుజులు సకలోపనిషత్ సమన్వయరూపమగు ‘ఉపనిషత్సిద్ధాన్త’మని ప్రఖ్యాతిగాంచిన శ్రీ విశిష్టాద్వైతమును సిద్ధాంతపరచిరి. దాని ‘సౌందర్యదర్శనము’ గావించి వారు ‘తిరుప్పావై జీయరు’ అయినారు. అది మన కందజేయదలచి మన పూర్వాచార్యులు ఆ గ్రంథమునకు వ్యాఖ్యానములను అనుగ్రహించిరి.

‘తిరుప్పావై‘ యందలి కావ్యపరమైన, శృంగారభరితమైన సౌందర్యములను నిరూపిస్తూ ఇవి పరమపురుష ప్రాప్తిసోపానముని సప్రమాణముగ నిరూపించి, దానిని మన దైనందిన జీవితమునకు అన్వయింపజేస్తూ మన పూర్వాచార్యులు చేసిన సూచనలు మనకు శిరోధార్యాలు.

శ్రీ విల్లిపుత్తూరు పట్టణంలో విష్ణుచిత్తులనే భక్తశిఖామణికి తులసివనంలో అయోనిజగా ఈమె లభించింది. ఈమె కూడా ‘భగవంతుని కొక మాలిక’యని భావించి ‘కోతై’ అని శ్రీ విష్ణుచిత్తులు పిలచారు. ఆ పేరే ‘గోదా’గా మారింది.

తండ్రి భగవానుని కోసం గుచ్చిన మాలికను ముందుగా తాను ధరించి తగుదునా స్వామికి అని చూస్కోనేది బాలగోదా. ఒకనాడు తండ్రి కంటపడింది. తగదీపని అంటూ తండ్రి ఆమెను దండించి, ఆ మాలలను దేమునికి పంపలేదు. స్వప్నంలో సాక్షాత్కరించిన స్వామి తనకామె దాల్చిన మాలలే కావాలన్నాడు. అచ్చెరునొందిన విష్ణుచిత్తులు ‘తనను రక్షించు తల్లి ఈమె’, ‘ఆండాళ్’ అంటూ ప్రసిద్ధినందినది. భగవంతుని పొందాలని పంతం కట్టి, గోపికలు శ్రీకృష్ణునికై రేపల్లెలో చేసిన కాత్యాయనీ వ్రతాన్ని అనుకరిస్తూ 30 దినాలు ఒక వ్రతమాచరించినది. రోజుకొక పాటను స్వామి ముందు ఆశువుగా గానం చేసింది.

తన ఊరే గోకులముగా, తోడివారంతా గోపీజనముగా, స్వామిమందిరము నందననందనుని భవనముగా, తానే గోపెమ్మగా భావించి గోపీత్వం పూర్తినందినది. చివరి దినాన శ్రీకృష్ణుడు ప్రసన్నుడై తన అభీష్టమును నెరవేరుస్తానన్నాడు. సకల భోగాలు ప్రసాదిస్తానన్నాడు.

గోదాదేవి భోగములందిన దినమే ‘భోగి’ అయింది. భగవంతుని ప్రాప్తికై ఆమె పాడిన తిరుప్పావై, సర్వమానవాళికి సన్మార్గాన్ని, ఉపనిషత్సారాన్ని ప్రదర్శించే అపూర్వ, అపురూప విజ్ఞానఖని. సర్వశాస్త్ర సారము ఇందులో ఇమిడివుంది. ఇది పాడిన వారికి సకలాభీష్టములు సులువుగా సమకూరుతాయని గోదాదేవి తన ఆచరణలో నిరూపించింది.

ధరించి విడచిన ఒక మాలతో స్వామిని బంధించింది. స్మరించి పలికిన పాటలమాలలో బంధించింది. ఆశ్రితుల రక్షణలో భగవానుని నిర్బంధించినది. ఆ పాశురముల నొక్కొక్కటిగా అందుకొని, ఆ మార్గముననుసరించుట మానవ జన్మకు సార్థకాన్ని, సాఫల్యాన్ని ఇస్తుంది. తనవంటి యోగ్యతను మనకు ప్రసాదించమని ఆండాళ్ అమ్మను ప్రార్థిద్దాం!

జైశ్రీమన్నారాయణ!!