శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రము

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి దివ్యవాణితో

ఓమ్ అస్మత్‌ గురుభ్యో నమః

భారతీయ సంస్కృతికి ఇతిహాసాలు రెండు. శ్రీ వాల్మీకి మహర్షి ప్రణీతమైన శ్రీ రామాయణము, శ్రీ వేదవ్యాస భగవానుడు అనుగ్రహించిన శ్రీమత్‌ భారతం. శ్రీమత్‌ భారతానికి రెండిటివల్లనే గౌరవం అని పెద్దల యొక్క శ్రీసూక్తి. అందు మొదటిది శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించిన శ్రీమత్‌ భగవద్గీత, రెండవది శ్రీభీష్మ పితామహుడు లోకానికి ప్రసాదించిన శ్రీవిష్ణు సహస్ర నామ స్తోత్రము.

ఈ రెండింటిలో మొదటిదానిని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశం చేసి సంజయుని ద్వారా లోకానికి అందించాడు. రెండవదానిని భారత సంగ్రామానంతరం అంపశయ్య పై పడియుండిన భీష్మ పితామహుని ద్వారా శ్రీకృష్ణపరమాత్మ పాండవులకు ఉపదేశింపచేసి లోకాన్నితరింపచేసాడు. ఈ రెండింటిలో భగవద్గీత కంటె శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం వల్లనే సులభంగా తరింపవచ్చునని శ్రీకృష్ణ అభిమతం.

ఈ భావాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా భీష్మపితామహుని దగ్గర వ్యక్తం చేసాడు. శ్రీకృష్ణుడు పాండవులనందరిని తీసుకొని భారతసంగ్రమానంతరం అంపశయ్య పై నున్న భీష్మపితామహుని దగ్గరకు వస్తాడు. ధర్మరాజుకు కల్గిన ధర్మసంశయములను తీర్చమని శ్రీకృష్ణుడు భీష్ముని కోరుతాడు. తనకు అవేవీ జ్ఞాపకం లేవు, చెప్పే శక్తి లేదు అంటాడు భీష్ముడు. అతనికి తెలిసినవన్నీ జ్ఞాపకం వచ్చేటట్లు పూర్వపు శక్తి కలుగునట్లు, నోట నీరు ఊరునట్లు, దేహబాధ తెలియనట్లుగ శ్రీకృష్ణుడు వరాలు ఇస్తాడు. ఆశ్చర్య-ఆనందాలతో భీష్మడు “అన్ని వరాలు నాకిచ్చి నాచే చెప్పించడమెందుకు కృష్ణా! నీవే చెప్పవచ్చు కద!” అని ప్రశ్నిస్తాడు. భారత సంగ్రామములో ఇరుసేనలను ఆపి మరి చెప్పాను “భగవద్గీత” నంతాను. విన్న అర్జునునకు అది ఏ మాత్రం పట్టలేదు. అప్పుడు నాకు ఆచార్య లక్షణాలు లేవు. అతనికి శిష్య లక్షణాలు పూర్తిగా లేకపోవడమే దానికి కారణం. పైగా పరమాత్మను నేనే కనుక తనను గూర్చి తనే చెప్పుకుంటే అందరికీ అసూయ కల్గిస్తుంది. ఒక తత్త్వాన్ని గురించి తత్త్వ దర్శనం చేసినవారు చెప్పాలే కానీ, తనను గూర్చి తానే చెప్పుకోరాదు కద, భగవద్గీతలో తత్త్వమైన నా ప్రభావాన్ని నేనే కీర్తించుకోవడం చేత అర్జునునికి ఏ మాత్రం ఎక్కలేదు. భీష్మపితామహా! నీవు తత్త్వ దర్శనం చేసిన ఆచార్యుడవు. నీ నుంచి తెలుసుకోవాలని పాండవులు కోరుతున్నారు. వారికి తత్త్వమును, హితమును ఉపదేశం చేయుము అంటాడు శ్రీకృష్ణుడు.

దాహం కల్గిన వానికి సముద్రం తనలో నీరు నిండాఉన్నా ఇవ్వటానికి వీలులేదు. ఇచ్చినా త్రాగటానికి పనికిరావు. ఆ నీటినే మేఘము గ్రహించి వర్షముగా కురిపిస్తేనే త్రాగ వీలవుతుంది. నేను సముద్రం లాంటి వాడిని. నాలో గుణప్రవాహాన్ని గ్రహించిన నీవు మేఘము లాంటి వాడవు కనుక పితామహా! నీవే వీరికి ఉపదేశించి ఆర్తిని తీర్చుము అని భీష్ముని ప్రోత్సహిస్తాడు.

భీష్ముడు పాండవులకు ఉపదేశం చేస్తూ ఉంటే తాను కూడా చేతులు కట్టుకొని విని, అది అట్లే అని అమోదిస్తాడు కూడా. అందుచేత దీనికి ప్రభావమధికము.

ముందుగ సామాన్య ధర్మాలను గురించి ధర్మరాజు అనేక సమాధానములు పొందెను. ఆపై “జన్మనెత్తిన ఏ జీవి అయినా ఈ సంసార చక్రమునుండి బయటపడాలంటే తెలియవలసిన తత్త్వమేది? ఈ జీవులు అపుడు ఎక్కడ చేరుతారు? ఆ చేరటానికి ఏమి చేయాలి? ఎవరిని స్తుతిస్తే, అర్చిస్తే మానవులు కోరిన సుఖాలన్నీ పొందుతారని నీవు భావిస్తున్నావో తాతా! దానిని అనుగ్రహించు” అని ధర్మరాజు ప్రశ్నిస్తాడు.

సర్వజగత్కారణమైన, సర్వలోకేశ్వరుడైన శ్రీమన్నారాయణుని “స్తువన్‌” = స్తోత్రము చేయుచు ‘తమేవ చ అర్చయన్‌’ అతనినే ప్రేమతో పూజిస్తే “సర్వ దుఃఖాతిగో భవేత్‌” అన్ని దుఃఖములను దాటి పోవచ్చునయ్యా. ఆ పుండరీకాక్షుని అర్చించడమే “ధర్మః అధికతమో మతః” అన్ని ధర్మాలలోకి శ్రేష్ఠమైన ధర్మమని నా అభిప్రాయం. అంతే కాదు అతని నామములను కీర్తిస్తే సకల పాపాలు పోతాయి. పవిత్రులౌతారు. ఏ కోరిక కోరినా అవన్నీ లభిస్తాయి. దీనిని మించిన గొప్ప మంత్రం మరొకటి లేదు. వేయినామాలు కల మూలమంత్ర మీ స్తోత్రము.

ఈ వేయిమంత్రాలు ఎక్కడివో తెలుసా? నేను కల్పించలేదు. “గౌణాని విఖ్యాతాని ఋషిభిః పరిగీతాని” = శ్రీమన్నారాయణుని గుణముల ననుభవించిన ఋషులు, ఆ అనుభవసారంగా ఒక్కొక్క నామాన్ని దర్శించి ఆనందించగా అక్కడక్కడగల ఆ ఋషుల వాగమృతం కలసి పరీవాహమై లోకములో మనం కూడా పాడగలిగేటట్లు శ్రీ వ్యాసభగవానుడు సేకరించి కృప చేయగా నేను దర్శించాను.

నీవడిగావు గనుక సర్వజీవులు ఉజ్జీవించడానికని చెప్పుచున్నాను. వినుము అని భీష్ముడు ఉపదేశిస్తాడు. అట్టి మహాభారత సారము, పరమఋషులచే దర్శితము, శ్రీ భీష్మ పితామహుని అభిమతము, శ్రీ వేదవ్యాస ఉపదేశలబ్థము, భగవద్గీత కంటే శ్రేష్ఠము, ఎందరో ఆధునికులు కూడ ఇదే సకల శ్రేయస్సంధాయకమని స్వీకరించిన ఈ శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని మనమూ నిత్యం పాడి కోరినవన్నీ పొందుదాము.

మహాభారతసారత్వాత్‌ ఋషిభిఃపరిగానతః
వేదాచార్య సమాహారాత్‌ భీష్మోత్కృష్ట మతత్వతః|
పరిగ్రహాతి శయతో గీతాద్యైకార్థ తశ్చ సః
సహస్రనామ్నా మధ్యాయః ఉపాదేయతమో మతః ||

  1. మహాభారత సారమగుట వలనను,
  2. ఋషిపుంగవులచే ప్రీతితో వాడబడిన నామములగుట వలనను,
  3. వాటినుండి తీసి వ్యాసమహర్షిచే స్తోత్ర రూపముగా కూర్చబడుట వలననూ,
  4. భీష్మ పితామహునిచే దీని పఠనము తన కత్యంతాభిమత ధర్మముగా పరిగణింపబడుటవల్లను,
  5. సమస్త ప్రామాణికులచేతను సకల గ్రంథముల చేతను, శ్రద్ధాభక్తి పురస్సరముగ పరిగ్రహింపబడుట వల్లను,
  6. భగవద్గీతాది బహు గ్రంథార్థములతో ఏకీభవించు అర్థముల బోధించుట వలనను, మనకు ఈ సహ్రసనామ స్తోత్ర పఠనము అత్యావశ్యకమని నిర్ణయింపబడెను.

జైశ్రీమన్నారాయణ!!