సర్వ విద్యాప్రదమగు హయగ్రీవ స్తోత్రము
మనుష్యులను బాగుచేయడం కోసం భగవంతుడెత్తిన అవతారాలు ఎన్నో చెప్పలేము. అన్ని అవతారాల గురించి తెలుసుకోలేక పోయినా, సాక్షాత్తుగ జ్ఞానాన్ని ప్రసాదించిన అవతారాలు కొన్నైతే, ఆచరణ నేర్పిన అవతారాలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిల్లో హయగ్రీవావతారం ఒకటి. దాన్ని గురించి తెలుసు కుంటున్నాం.
హయగ్రీవుడనగ గుఱ్ఱమువంటి శిరస్సు, మానవదేహము కలవాడన్నమాట. నరసింహావతారం వలెనే ఈ హయగ్రీవుని అవతార స్వరూపము అద్భుతంగాను, ఆశ్చర్యకరంగాను ఉంటుంది. భగవంతుని చేష్టలన్నీ అద్భుతాలు, ఆశ్చర్యకరములు, ఆనందప్రదములు గద!
ఈ హయగ్రీవుని గురించి శ్రీమద్భాగవతంలో 2.7.11లోను, 5.18.6లోను శ్రీ వేదవ్యాస భగవానుడు ప్రకటించినాడు. శ్రీమన్మహాభారతంలో గూడ శాంతిపర్వంలోని నారాయణీయమున ఈ అవతార విశేషాలు ప్రస్తావించబడ్డాయి.
సృష్టి ఆరంభంలో, అంటే కొన్ని కోట్ల సంవత్సరముల క్రితం, చతుర్ముఖ బ్రహ్మకి, పరమాత్మ వేదాన్ని ఉపదేశించారు. అయితే ఆ ఉపదేశాన్ని ఆయన శ్రద్ధగా వినలేదు. గురువు చెప్పే పాఠం మీద శ్రద్ధ లేకపోవడం ఒక దోషం. దాని ఫలితంగా మధుకైటభులనే అసురులు పుట్టారు. వారు బ్రహ్మనుండి ఆ వేదాన్ని అపహరించుకుపోయారు. వారినుండి ఆ వేదాన్ని తిరిగి సంపాదించటానికి భగవంతుడు హయగ్రీవావతారం ధరించాడట. ఆ అసురులను తొలగించి బ్రహ్మకి తిరిగి వేదాలనిచ్చాడీ హయగ్రీవరూపంలో.
పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడు చాలా దయకలవాడు. బ్రహ్మకు అడగకుండానే వేదాలను చెప్పేసాడు. వేదాలంటే అన్నిరకాల విజ్ఞానానికి నిలయాలన్నమాట. అయితే మాత్రమేం, అడగకుండా చెప్పే విద్యకు విలువ ఏం ఉంటుంది? అందుకే బ్రహ్మగారికావిద్య పట్టుబడలేదు. ఉపదేశం పొందిన బ్రహ్మ ఎదుట నాలుగు వేదాలు నలుగురు పురుషులరూపాలు ధరించారట. అదే సమయంలో మధుకైటభులనే అసురులు వచ్చారు. బ్రహ్మనుండి వేదాలు అపహరించుకు పోబోయారు. తమని అప్పగించినది బ్రహ్మకి గద! అంచేత ఆయన పక్షాన వేదపురుషులు గూడ పోరాడినా లాభం లేకపోయింది. ఆ అసురులు, బ్రహ్మను వదలి, ఈ నలుగురు వేదపురుషులను పట్టుకొని రసాతలానికి పారిపోయారు.
దీపంపోతే చీకటి ఆవరించినట్లు, జ్ఞానదీపాన్ని పోగొట్టుకున్న బ్రహ్మ, పరమాత్మకోసం, జ్ఞానం ప్రసాదించమని, ఓ గొప్ప యాగముచేసాడు. పరమాత్మ జాలితో కరిగి రసాతలానికి పోయి, హయగ్రీవ స్వరూపం ధరించి గట్టిగా సకిలించెనట. అపూర్వమైన ఆ ధ్వని విని భయపడి అసురులు పారిపోయారు. హయగ్రీవుడు అక్కడున్న నలుగురు వేదపురుషులను జాగ్రత్తగా పైకితెచ్చి, యాగంచేసే బ్రహ్మ ఎదుట అగ్నిహోత్రంలోంచి ఆవిర్భవించి, ఆర్తితో అడుగుతున్న ఆ బ్రహ్మకు మళ్ళీ అందించాడు.
హయగ్రీవుని సకిలింపు “ఉద్గీధ”మనే సామవేదగానంలా ఉంటుంది. మొదట అది విని పారిపోయిన అసురులు తిరిగి వచ్చి తాము దాచినచోట వేదాలకోసం వెతికారు. వేదాలు లేకపోయేసరికి ఇది విష్ణువు చేసిన పనే అని తెలిసి పాలకడలికి చేరారు. సముద్రంపై ఆదిశేషుని శయ్యగ చేసుకొని శయనించిన పరమాత్మతో యుద్ధానికి దిగారు. దేమునితోనా పోరాటం? వాళ్ళిద్దరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. పరమాత్మతో పోరాడినా వారే అయినా వారికది మోక్షాన్నే ఇస్తుంది. అసురులు తరించారన్నమాట. ఇప్పుడు కావాలని అడిగి చెప్పించుకున్నాడు గద చతుర్ముఖుడు! అంచేతనే వేదవిజ్ఞానం స్థిరంగ ఆతనికి జ్ఞాపకముండిపోయింది. మళ్ళీ ఏ ఉపద్రవాలకు లోనుకాలేదుట.
అందుకే ఆర్తితో అడగనివారికి విద్యాదానం చేయరాదని శాస్త్రం చెప్తోంది. అడగని వారికిచ్చిన వేదవిజ్ఞానం, తీస్కొన్నవారికి పట్టకుండ పోతుంది.
అమావాస్యకాని, పూర్ణిమకాని కాగానే వచ్చే మొదటి రోజును‘ప్రతిపత్’ లేక ‘పాడ్యమి’అంటారు. భగవానుడు చతుర్ముఖుని సృష్టించినది ఆ ‘ప్రతిపత్’ దినాన్నే చతుర్ముఖ బ్రహ్మకి వేదవిద్యను గూడ ఆ రోజే ఉపదేశం చేసాడు. ప్రతిపత్ రోజున చెప్పిన పాఠము నిలువలేదు. నశించింది. ఆనాటి నుండే ప్రతిపత్ తిథినాడు క్రొత్త పాఠము చదువరాదనే నియమం ఏర్పరచినారట.
మాములు రోజులలో అడిగినా యివ్వవచ్చు భగవంతుడు. ముఖ్యంగ ఆయన అవతరించిన దినాన అంటే పుట్టినరోజు పండుగనాడు, ఆయన్నారాధించి, ఆయన స్తోత్రాది పారాయణలు చేస్తే ఆయనకు ఎంతో ప్రేమకలిగి, మంచి శక్తివంతమైన, సకల ఫలములను పొందటానికి వీలయ్యే ఉన్నత విద్యను, అద్భుత విద్యను అనుగ్రహిస్తాడు ఆ హయవదన పరబ్రహ్మ.
యజ్ఞకుండంలో ఈ హయవదనుడు ఆవిర్భవించిన రోజు శ్రావణమాసంలో పూర్ణిమ. ఆనాడాయన్నారాధించి స్తుతించి ప్రసన్నుడిని చేసుకుంటే, ఏ విద్యను ప్రార్ధిస్తే, ఆ విద్య మనకు నిలవడానికి ఉండే ఆటంకాలన్నీ తొలగించి, సంతోషంతో ఆయా విద్యలను ప్రసాదిస్తాడీ హయగ్రీవరూపధారి అయిన పరబ్రహ్మ. హయగ్రీవుణ్ణి “రూపుదాల్చిన విద్య” గా మన పెద్దలు ఆరాధిస్తారు.‘హయం’ అంటే విజ్ఞానము. గ్రీవమంటే కంఠము. అన్ని రకాల విద్యలు కంఠగతములై ఉన్న సర్వవిద్యా స్వరూపమే హయగ్రీవమూర్తి అన్నమాట.
విద్యలన్నింటికి మూలమైన ఋక్, యజుస్, సామ, అధర్వణాలనే వేదాలు. అవన్నీ శక్తివంతమైన శబ్దాలతో నిండి ఉన్న మంత్రాలుగా ఉంటాయి. మంత్రాలన్నింటికీ బీజాక్షరాలని ఉంటాయి. ఆయా మంత్రాల శక్తి అంతా ఆ బీజాక్షరాలలో ఉంటుందట. మంత్రాలవలె ఆ బీజ అక్షరాలు స్పష్టంగా ఉండవు. అర్థమేమీ ఉన్నట్లు ఉండదు. కాని బ్రహ్మాండమైన శక్తిమాత్రం కలిగివుంటాయి. ఈ బీజాక్షరాలనే మంత్రాలకు ‘ఉత్తమాంగం’ అంటారు. ఉత్తమాంగమంటే ‘శిరస్సు’అన్నమాట.
మంత్రాలన్ని శరీరముగ రూపుదాలిస్తే ఆ మంత్రాలకు, బీజాక్షరాలవలె శిరఃస్థానీయమైనది.‘హయవదనము’. ఈ హయవదనుని సకిలింపునకు అర్థం తెలియదు. గుఱ్ఱపు సకలింపునకు అర్థమేమిటో మనకు తెలీదుకద! అయితే ఈ హయగ్రీవమూర్తి ధ్వనిమాత్రం అర్థములేనిది కాదట. బీజాక్షరాలవలె సర్వశక్తి సంపూర్ణము. సర్వదోష నివారణము. కనుకనే, ఆ ధ్వనిని విని అసుర శక్తులు పారిపోయాయి.
అందుచే బీజాక్షరాలన్నీ, మంత్రాలన్నీ మనం చదవలేకపోయినా వాటి మూల స్వరూపమైన హయగ్రీవ స్వామిని స్తుతిస్తే ఆయన కృపతోటే సర్వవిద్యలూ మనకు ప్రకాశిస్తాయి. అలాంటిది, ఆ మూర్తిమంత్రము యొక్క బీజాక్షరాలుగూడ తెలుసుకొని పఠిస్తే స్వామి కృపకల్గి స్థిరమైన విద్య లభించడంలో సంశయమేమి?
ఆ హయగ్రీవుని ప్రభావం తెల్పుతూ శ్రీమన్నిగమాంత దేశికులు 33 శ్లోకాలు రచించారు. ప్రతి శ్లోకంలోనూ కొన్ని కొన్ని బీజాక్షరాలు నిక్షేపించేట్టుగ స్వామి, వారినోట ఈ స్తోత్రాన్ని 33 శ్లోకాలుగ పలికించాడు.
దేవతలంతా 33 విభాగాలట. అంటే మంత్ర బ్రహ్మములయిన అష్టాక్షరీ ద్వయమంత్రాలు మొత్తం అక్షరాల సంఖ్యకూడా 33. ఒక్కొక్క అక్షరంలోనూ ఉండే దైవీశక్తిని ఒక్కొక్క శ్లోకంలో నిక్షేపించి ఈ స్తోత్రాన్ని శ్రీదేశికులవారు ప్రసాదించారు. అనుభవజ్ఞులయిన పెద్దలీ విషయాన్ని స్పష్టంగా దర్శించారు. అందుచే ఏ రకమైన వాక్ శక్తి కావాలన్నా అర్థజ్ఞానము కలగాలన్నా సాధింపచేసి, ఈ స్తోత్రమే యివ్వగలదని విజ్ఞాన నిధులగు పూర్వాచార్యులేమి, సుజ్ఞాన సాగరులగు నవీన పండితులేమి ఈ మూర్తిని స్తోత్రాన్ని ఎంతో ఆదరిస్తారు.
విద్యలలో ఉత్తమశ్రేణికి చెందాలనే ఉత్సాహముకల ఉత్తమ జిజ్ఞాసువులంతా తమ వాక్, అర్థ సంపద పెంచుకోడానికి ఈ స్తోత్రములో చూపిన ఆయా శ్లోకములను పఠించి ప్రయోజనమును పొందెదరుగాక!.