అష్టశ్లోకీ - పరిచయం

గ్రంథకర్త: శ్రీ పరాశరభట్టార్యః

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

శ్రీ పరాశర భట్టారకులవారు అష్టాక్షరీ, ద్వయ, చరమమంత్రాల సారాంశమునంతటిని 8 శ్లోకాలలో యిమిడ్చి “అష్టశ్లోకి”గా మనకందించారు. ఈ శ్లోకాలను వాటి అర్థ, తాత్పర్యాలతో నేర్చుకుందాం..

మంత్రసారము

జీవరాశిలో మానవుడు గొప్పవానిగా తనను గుర్తించుకుని బ్రతుకుతున్నాడు. దీనికి కారణం జ్ఞానము. మిగిలిన జీవులకంటే మనుష్యులలో విలక్షణముగ ప్రకాశించుట. మిగిలిన జంతు, పక్షిజాలములకూ జ్ఞానమూ, తెలివి ఉన్నవి.

అయితే అవి నేనెవరూ అని ఎన్నడూ ప్రశ్నించుకొనవు. ఆహార సముపార్జన చేసుకుంటూ, తినగలిగినంత తిని, తిరుగుతూ, పిల్లలనుకంటూ, నిదురపోతూ మాత్రమే జీవిస్తాయి. ఎవరయిన నియమిస్తే వారికి లొంగి, చెప్పినంతవరకూ నిస్స్వార్థంగ చేతనయి నంత పనిచేస్తాయి ఫలాపేక్ష లేకుండా.

ఇవే వాటికి తెలుసును తప్ప నేను ఎవరు అని కాని, శరీరమునకు తనకు సంబంధం కలియుటకు కారణమేమి అని గాని, శరీరం విడచిన తానేమి అవుతాననిగాని మిగిలిన జంతువులేవీ ఆలోచించ లేవు. ఒకవేళ ఆలోచిస్తాయేమో మనకు తెలియదుగాని ఆ లోపలి భావాలకు అనుగుణంగ తాము పనిచేయలేవు.

ముఖ్యంగ తమ భావాన్ని ఇతరులకు ప్రకటించి, తెలిపే యోగ్యత ఒక్క మనిషికి తప్ప ఏ యితర జీవికి లేదు. దీనివల్లనే సమాజంపై ప్రకృతిపై ఆధిపత్యాన్ని మానవుడు కొంతవరకైనా సాగించగలుగుతున్నాడు.

తిండి, నిద్ర, కనుట, తిరుగుటలు చేస్తే బ్రతుకుటను జీవించుట అంటారు. నేనెవరూ? అని కూడా ఆలోచిస్తూ ఆ ప్రశ్నకు సమాధానమును అన్వేషిస్తూ బ్రతికితే ‘ఉజ్జీవించుట’ అనవచ్చు. ఈ ఉజ్జీవించగోరువారు ఆలోచించే విషయాలు ముఖ్యంగ ఐదు ఉంటాయి. అవి నేనెవరు? నా జీవితానికి లక్ష్యం ఏమిటి? దానికి యిచ్చేవాడెవడు? ఆ లక్ష్యాన్ని చేరడానికి సాధనమేమిటి? ఆ లక్ష్య సాధనకు ఆటంకాలేమయినా ఉన్నవా, ఉంటే ఎట్లా తొలుగుతాయి? ఇత్యాది ఈ ఐదు విషయాల గురించి ఆలోచించే జ్ఞానమున్నవాడే మానవుడుగ గుర్తించదగినవాడు. ఆ జ్ఞానంకంటే ఇతరత్రా ఎన్నెన్ని విషయాలు తెలిసినా, ఎంతెంత చదివినా ఆ జ్ఞానము పశువుల, పక్షుల జ్ఞానములతో ఏదో ఒక కోవలోకి వాళ్ళని చేరుస్తుంది.

కారణం, మిగిలిన విషయాలన్నీ మనుష్యులకంటే వాటికే బాగా తెలుసు. ప్రకృతి స్వరూప స్వభావాలు, ఎలా ప్రకృతికి అనుకూలంగ తమను మలచుకోవాలో, ప్రకృతిలో కలిగే వైపరీత్యాలను ఎలా ముందుగ గుర్తించాలో తట్టుకోవాలో, శరీరాన్ని ఎలా స్వాధీనంలో ఉంచుకోవాలో, ఆహార స్వీకరణలో నియమాలెలా పాటించాలో, ఇతర జీవులతో వేనితో, ఎంతవరకు కలసి ఉండాలో, తనవారితో ఎలా కలిసిమెలసి ఉండాలో క్రమశిక్షణ అనేది నేర్పనక్కర లేకుండా శరీరనిర్మాణంతోపాటే అలవడవలసిన గుణమని, దానినెలా పాటించే శీలముండాలో ఇవన్నీ చీమల నుండి ప్రారంభిస్తే పక్షుల దాకా బాగ, చాలా బాగ తెలుసు.

మనిషికే ఈ పైవాటితో వేటిల్లోను కనీసం ప్రాథమిక జ్ఞానం కూడా లేదు. శిక్షణ యిచ్చినా అబ్బేది అంతంతమాత్రమే.

ఏ చదువులూ అక్కర లేకుండా, డబ్బుల ఖర్చు లేకుండా పశువులు, పక్షులు గుర్తించే ఈ పై విషయాలను నేర్చుకోడానికే, మనిషి, తన జ్ఞానాన్నంతటిని వినియోగించి వినియోగించి, పైవాటిలో మహా నేరిస్తే ఏ ఒక్కటి రెంటినో నేర్చేసరికి వీని జీవితం కాస్తా అయిపోతుంది. ఆ మాత్రానికే అలాంటివారిని మహాజ్ఞాన శాస్త్రవేత్తలని ప్రొఫెసర్లనీ, డాక్టర్లనీ పెద్ద సర్టిఫికెట్లను యిచ్చి సన్మానిస్తూ ఉంటారు.

పై విషయాలన్నీ తమకు తెలిసినా, తెలుసునని గర్వించక బుద్ధిగ ఆచరిస్తూ బ్రతుకుతాయి జంతువులన్నీ.

ఏది తెలియకున్న అన్నీ తెలుసునని గర్వంతో తెలిసిన కాస్త దంభముతో గొప్పలు చెప్పుకుంటూ బ్రతుకుతాడు మనిషి. తెలిసిన కాస్త అయినా తెలుసునని చెప్పుకోడానికే తప్ప, ఇంతకీ ఆచరించడానికి మనుష్యులకు చేతనేకాదు. ఆ విషయంలోనూ జంతువులే చాలానయం.

ఇక మనిషి తాను మనిషి కావాలని అనుకుంటే, పైన చెప్పిన ఐదింటి గురించి ఆలోచించీ, తెలుసుకొని, ఆ తెలివి ప్రకారం ఆచరించగలగాలి. దానినే మనిషికి ఉండవలసిన “జ్ఞాన”మని అంటారు. అదితప్ప మిగిలినదంతా ‘అజ్ఞానమే’ అంటారు. తత్ జ్ఞానం, అజ్ఞానమతోఽన్యదుక్తం అత్యంత దుర్లభమైన మానవశరీరమనే జీవననౌక ఈ సంసారసాగరంలో ఈ జీవునికి లభించింది… వానిని గురించి ఆలోచించడానికే.

యిది ఎంతోకాలముండదు. ఉండగ దీనిని ఆ మార్గంలో ఆలోచించడానికి నడపడు. సరదాగ ఇటు అటు షికార్లు చేస్తే యిందులో ఉండే సమయము అయిపోయి, దీనిలోంచి దింపేస్తాడు భగవానుడు. తిరిగి మరెప్పుడు ఇంతమంచి ఆలోచన చేయగల శరీరము లభించకపోవచ్చును.

గంట సమయమిచ్చి ఒక టిక్కెట్టు కొనిచ్చి చూచిరమ్మని జంతు లేదా వస్తు ప్రదర్శనశాలకు పంపితే చూడటానికి అక్కడకి చేరి, చేతిలో ఉన్న టిక్కెట్టునే చూచుకొంటూ ఎంత బాగున్నదెంత బాగున్నది అంటూ గంట గడిపేస్తే అక్కడివారు సమయమైందని వానిని బయటకు పంపేస్తారు.

ఏం చేయాలివాడు?

టిక్కెట్టు సౌందర్యాన్ని కాదు వాడు చూడవలసింది. ఆ శాలలో ఉండే వస్తువుల, జంతువుల సౌందర్యాన్ని గద! అలాగే ఈ ప్రకృతి అనే శాలలో జగన్మయుడైన భగవానుని గుర్తించి, ఆతని సేవను లభించే ఉపాయం ద్వారా ఆతని సాయుజ్యాన్ని పొంది, దుఃఖములు దూరమై నిత్యానందమయ జీవితాన్ని గడపటానికి ఈ మానవ శరీరమొక టిక్కెట్టులాంటిది. ఇది ఉన్నవాడే ఆ రకమైన ఆలోచన చేయగలుగుతాడు. మిగిలిన జీవులకు ఆ టిక్కెట్టు లేదు కనుక అవి ఈ ప్రకృతి పురుష సంబంధాన్ని గురించి కనీసం భావించను కూడ లేవు.

మానవ శరీరము లభించాక కూడ ఈ శరీరాన్నే చూచుకుంటూ దీని సౌందర్యాన్నే పెంచుకుంటూ దీని బంధువులనే లాలించుకుంటూ, పోషించుకుంటూ ప్రకృతికే పరిమితమైపోయి, దానినే పరిశోధిస్తూ గడిపేస్తే ఉన్న కాస్త సమయం పూర్తైపోయి ‘ఇక చాలును’ సమయం మించిపోయిందని ఈ శరీరంలోంచి పంపేస్తాడీజీవుణ్ణి. మళ్ళీ ఏం శరీరం వస్తుందో ఏమో ఎవరికి తెలుసు? కనుక మనిషై జన్మించిన ప్రతివాడు పై ఐదు విషయాలని ఆలోచిస్తే వాని జన్మ సార్థకము, చరితార్థము అవుతుంది. లేనిచో, అట్టి మానవుని జన్మభూభారమును పెంచేదే తప్ప లెక్కింపదగినది కాదు.

ఒక పెద్ద సైంటిస్టు ఒక నదీతీరాన చేరి అక్కడొక పడవ నడిపే వాడు కనిపిస్తే... వానినడిగి పడవనెక్కినాడు. పడవను నదిలోనికి నడపమన్నాడా సైంటిస్టు.

పల్లెవాడు నడుపుతున్నాడు. కొంతదూరము వెళ్ళగానే పల్లెవానిని ఒక ప్రశ్నవేశాడీ సైంటిస్టు. ఏమోయ్! చిన్న ఇసుకరేణువు నీళ్ళలో వేస్తే ఏమౌతుంది? దానికి పల్లెవాడు మునిగిపోతుంది బాబూ! అన్నాడు.

మరింత బరువైన పడవనీళ్ళలో వేస్తే మునిగిపోదేమి? తెలుసా! అడిగాడు సైంటిస్టు. తెలీదన్నాడు పల్లెవాడు. అయితే నీ జీవితంలో సగం వ్యర్థం. ఈ పడవతో బ్రతుకుతూ, పడవ ఎందుకు తేలుతోందో తెలియకపోతే ఎలా? అంటూ వివరించాడా సైంటిస్టు.

చదువుకున్నవాడు కద! ఏదో ఒకటి మాటలాడకపోతే తోచదు. నోరు ఊరకే ఉండదు. పైగా ఆతడు కాస్త వాగుడుకాయ కూడాను. మరికాస్సేపటికి మేఘాలను చూపించి వాటిలో ఏముంది? అని అడిగాడా పల్లెవానిని.

‘నీళ్ళుంటాయండీ!’ జవాబిచ్చాడు పల్లెవాడు.

చేత్తో నదిలోంచి నీళ్ళు తీసి పైకి విసిరాడు. అవి క్రిందపడి పోయాయి. వెంటనే ‘చూచావా’ అడిగాడు సైంటిస్టు.

‘చూచానండీ!’

‘ఏమర్థమైంది?’ మళ్ళీ ప్రశ్నించాడు.

‘తెలీదండీ’ జవాబిచ్చాడు పల్లెవాడు.

“కాసినన్ని నీళ్ళు పైకి విసిరితే వెంటనే క్రిందపడిపోయాయి కదా! మేఘాలలో అన్ని నీళ్ళు ఎలా ఆకాశంలో తేలుతున్నాయో తెలుసునా నీకు?” గంభీరంగ అడిగాడు సైంటిస్టు.

ఆశ్చర్యంగ అంత నోరు తెరచి ‘నాకెప్పుడూ ఇది తెలియనే తెలియదండీ అబ్బాయిగారూ!’ జవాబిచ్చాడు.

‘అయ్యో! ఎందుకు నీ జీవితమంతా యిలా, మంచి మంచి విషయాలు తెల్సుకోకుండా పాడుచేసుకుంటావు. నీటిలో పుట్టావు. నీటిలో తిరుగుతావు, నీటిలో తడుస్తావు. నీటిలోనే తింటావు. ఆ నీటి గురించి యింత మాత్రమైనా తెల్సుకోకపోతే ఎలా? ఎంత జీవితం వ్యర్థమైపోయిందో యింతవరకూ చూచావా. నీకు ముప్పాతిక జీవితం గడిచిపోయింది...’ అంటూ ఉపన్యాసం దంచేస్తున్నాడీ సైంటిస్టు.

పడవ మెల్లగ నదీమధ్యంలో రాళ్ళ ప్రాంతంలోకొచ్చింది. గాలి పెరిగింది. అలలు లేస్తున్నాయి. కెరటాల తాకిడికి పడవ ఊగుతోంది. పెద్ద పెద్ద కొండరాళ్ళుండటం వల్ల పడవ అదుపుతప్పి వాటికి తాకుతోంది. కాస్సేపట్లో పగిలిపోయేటట్లుంది.

అపుడా పల్లెవాడు అడిగాడీ సైంటిస్టుని ‘అయ్యా! మీకు ఈదడం

వచ్చా?’

‘ఎందుకు?’ అన్నాడు సైంటిస్ట్.

‘పడవ విరిగిపోతోంది. అపుడీ నీళ్ళలో ఈదితే తప్ప మనం బ్రతకం. ఒడ్డును వదిలి చాలాదూరం వచ్చాం. యిపుడు ఈ తుఫానులో ఒడ్డుదాక మన పడవచేరే నమ్మకంలేదు. క్రిందంతా రాళ్ళమయం. నదిలోకూడా ప్రమాదకరమైన జంతువులేమైనా ఉండచ్చు. అంచేత ఈదుకుపోవాల్సి ఉంటుంది ఒడ్డుకి’.

సైంటిస్టుకి తలపై పిడుగుపడ్డట్లైంది. ‘అమ్మో! నాకు ఈతరాదు. మరి యిప్పుడెలా? ఏమిటి సంగతి?’

పల్లెవాడు నిబ్బరంగ సమాధానం చెప్పాడు. ‘అయ్యా! నాకు చదువురాదు. మీరింత వరకూ చెప్పినవేమీ తెలియకున్నా ప్రమాదం లేదు. కాని ఈ నీళ్ళలో ఉంటూ అసలు తెలియవలసిన ‘ఈత’ తప్ప మిగిలినవన్నీ తెలుసుమీకు. కానీ అవేవీ మిమ్ములనిప్పుడు రక్షించవు. ప్రస్తుతం కావలసినది పుస్తకాలలోంచి వచ్చిన పోతజ్ఞానం కాదు. ఈతజ్ఞానమే కావాలి’ అంటూ పల్లెవాడు ప్రమాదాన్నుంచి తప్పించుకు బయటపడ్డాడు.

తుఫానుకు పగిలిన పడవతోపాటు అన్ని చదువులు చదివినా ఏమీ అక్కరకురాక ఆపదలో అసువులు బాసినాడా అమాయకుడు. ఇదీ మన జీవితకథ.

సంసారసాగరంలో దుఃఖాల కెరటాలపై ప్రయాణం చేసే వాళ్ళం మనం. కడతేరడానికి శరీరమనే జీవననౌక లభించింది. దానిని నడపడానికి వసతులన్నీ ఉన్నాయి. లక్ష్యం తెలియాలి. ఈ సాగరంలో సుఖప్రయాణం సాగాలంటే 5 విషయములను గురించిన జ్ఞానం అత్యావశ్యకం. ఆ ఐదింటిని అర్థపంచకజ్ఞానం అంటారు. ఈ జ్ఞానంకంటే యితర జ్ఞానాలెన్ని ఉన్నా, సైంటిస్టులాగే నష్టపోక తప్పదు. ఈ అర్థపంచక జ్ఞానముంటే మిగిలినవి అన్నీ రాణిస్తాయి. అసలప్పుడవి లేకున్నా నష్టమేమిరాదు.

ఈ అర్థపంచకజ్ఞానాన్నిచ్చి మానవజన్మను సార్థక పరచాలనే ఋషులు ఎంతో శ్రమించి ఎన్నెన్నో విషయాలను మనకందించారు. వేదాలన్నీ ఈ జ్ఞానాన్నివ్వడంవల్లే సార్థకములైనాయి.

ఇతిహాసాలయిన శ్రీరామాయణ శ్రీమద్భారతాలుగూడ ఈ జ్ఞానాన్ని బోధించడమునకే. పురాణములకు కూడా లక్ష్యం ఈ జ్ఞానాన్నందించుటయే.

స్మృతులు, మునులు, మహానుభావులు, ఆచార్యులు, ఆళ్వారులు మొదలయిన మన పూర్వులందరూ ఏ ఏ ఉపదేశం చేసినా ఈ అర్థపంచకజ్ఞానాన్ని వివరించటానికే.

ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఆ ఐదింటిని వివరించి కొందరు, విస్తరించి కొందరు, సూక్ష్మీకరించి కొందరు ఇలా రకరకములుగ అందించారు. ఆ ఐదింటిని గురించి ఒక్కసారి తిరిగి జ్ఞాపకం చేసుకుందాం!

1. నేనెవరు దీన్ని గురించి ఒక్కసారి తిరిగి తెలుసుకోవటాన్ని స్వస్వరూపజ్ఞానం అంటారు.

2. నా జీవితానికి లక్ష్యమేమిటి? అంటే నేనేమి పొందాలి? దానిని ఫలస్వరూపజ్ఞానం అంటారు.

3. దానిని యిచ్చునదెవరు? అంటే పొందించు భగవత్ స్వరూప మేమి? దీనిని పరస్వరూప జ్ఞానము అంటారు.

4. పొందవలసిన దానిని పొందుటకు సాధనమేమి? దీనిని ఉపాయ స్వరూపజ్ఞానము అందురు.

5. దానిని పొందుట కాటంకములేమి. అవి తొలగుట ఎట్లు? దీనిని విరోధిస్వరూపజ్ఞానము అంటారు.

ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తిః తథాప్రాప్తివిరోధి చ| వదన్తి సకలావేదాః సేతిహాస పురాణకాః మునయశ్చ మహాత్మానః వేదవేదాన్త పారగాః|| అనే శ్లోకములీ విషయాన్ని స్పష్టపరుస్తున్నాయి.

మానవులందరినీ సామాన్యంగ రెండువర్గాలుగ విభజించవచ్చు. బుభుక్షువులు, ముముక్షువులు అని. తమ జ్ఞానమంతా శరీరపోషణకోసం మాత్రమే, శారీరక బంధువులకోసమేననుకుంటూ కేవలం ప్రాపంచిక సుఖముల సముపార్జన భోగమే పరమార్థంగ బ్రతికేవారు కొందరు. వీరిని ‘బుభుక్షువులు’ అంటారు. శరీరంలోని జీవుడొకనిని గుర్తించి, వాని స్థితిగతులను గూర్చిన జ్ఞానసముపార్జన చేస్తూ తదనురూపముగ ఆచరించాలనే కాంక్షతో జీవిస్తూ, అలాంటి లాభానికి ఆటంకంగ ఉన్న బంధాల నుండి విడిపడాలనే కోరేవారు కొందరు. విడిపడుట యందు కోరికకలవారు కేవలం విడివడుట మాత్రమేగాక నిత్యానందము నందుటయందు కూడా కోరిక కలవారన్నమాట. ఒకదానిని విడచుట ఆపై దానిని పొందుట కొరకే గద! కనుక వీరిని ‘ముముక్షువులు’ అంటారు. బుభుక్షువుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరంలేదు. ముముక్షువులుగ మనం ఉండదలుస్తున్నాము కనుక మన మెఱుంగవలసినవాటి యందు శ్రద్ధ చూపడం అవసరం. అదే ‘అర్థపంచకజ్ఞానము’ దీనినే మరింత నూక్ష్మీకరించి మూడు విషయాలుగ మన పూర్వులు అనుగ్రహించారు.

స్వజ్ఞానం ప్రాపకజ్ఞానం ప్రాప్యజ్ఞానం ముముక్షుభిః| జ్ఞానత్రయ ముపాదేయం ఏతదన్యం న కించన|| ముముక్షువయిన చేతనునకు తెలుసుకోతగిన మూడు విషయములు. తానెవరు అనే జ్ఞానం అనగ ఆత్మయొక్క యధార్థమైన స్వరూప స్వభావములనెఱుంగుట, పొందదగిన ఫలమును ఏ సాధనముతో లభించవచ్చుననెడి ప్రాపకజ్ఞానం అనగ ఉపాయము యొక్క యధార్థమైన స్వరూపమునెఱుంగుట, పోరాడవలసిన వాటిలో ఉత్తమోత్తమమైన, శాశ్వతికమైన ప్రాప్యజ్ఞానం అంటే ఫలముయొక్క స్వరూపము నెఱుంగుట. ఈ మూడింటిని గురించి తెలిసిన అన్నియు తెలిసినట్లే. ఇక తెలియవలసినదేదియు మోక్షప్రాప్తికవసరంలేదు.

సకల వేదశాస్త్ర, ఇతిహాస, పురాణ, ఆగమ, ప్రబంధాది వాఙ్మయమంతా సవిస్తరంగ నిరూపించిన ఈ మూడింటిని గురించిన జ్ఞానం ఎంత గహనమైనదో దీనినిబట్టి అర్థమవుతోంది గద! మనకు. ఇన్నీ చదివినా, ఇంకా ఈ మూడు లేక ఐదు విషయములను గ్రహించుటలో మహామేధావులైన ఎందరో తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. దానికి కారణము వారు సరి అయిన మార్గదర్శకులను ఆశ్రయించకపోవడమే. వారికి అందని ఈ విషయములను మరి ఈ కాలపు అల్పజ్ఞానము, అల్పశక్తి, అల్పావకాశము కల జనులు గుర్తించుట మరింకెంత కష్టమోగద!

పూర్తి యాంత్రికమైన ప్రపంచంలో ఆ యంత్రములకంటే ఘోరంగ జీవితం గడిపే మనిషికి బాగుపడాలని కోరికైతే ప్రగాఢంగ ఉంది. కాని, వేదాలను వల్లెవేసేటంత తీరికలేదు. వేసినా ఒకవేళ వాటి అర్థాలను పరిశీలించే శాస్త్రపాండిత్యాన్ని ఆర్జించే సమయం బొత్తిగలేదు. సుదీర్ఘములయిన ఇతిహాసాలను చదివే సమయం, జ్ఞానం, అవగాహన కొఱపడ్డాయి. పురాణాలను చదివితే, సర్వశాస్త్ర సమన్వయశక్తి లేకపోవడంవల్ల అపార్థాలు గోచరిస్తున్నాయి. సదాచార్యులు, జ్ఞాననిధులు తాము ఆ శ్రమలన్నీపడి మనకు తత్ సారాంశాన్ని ప్రవచనంగా అందిస్తామంటే తీరికేది? పోనీ, ఈ నదీప్రవాహంలోపడి కొట్టుకుపోవటమేనా, ఈ జీవితానికిగతి? అదసలు యిష్టంలేదు. తరించాలని కోరిక ఉంది. జన్మ వ్యాధి, జరా, మరణ దుఃఖాన్నించి బయటపడాలని ఆశ ఉంది. అత్యల్పమైన శ్రమతో, అత్యుత్కటమైన దుఃఖాలు తొలగి అనన్తమైన ఆనంద ఫలాన్ననుభవించాలని అంతా కోరుకుంటున్నాము. దానికేమి సాధనము? తెలియాలి.

ఈ అజ్ఞానాన్నందించే ఆ సులభ సాధనము కేవలము శరీరబంధాలు తొలగిన పిదప మాత్రమే ఫలితమునిచ్చేదై, జీవించి ఉన్నంతకాలము మనదారిన మనని వదలివేసేదో, లేదా భౌతికమైన ప్రాపంచిక సుఖాలకాటంకం కలిగించేదో కారాదు. కనీసం ఈ సుఖాలను భోగాలను పాడుచేయనిదై ఉండాలి. వీలుంటే వీటిని మరింత పెంచేది కూడా అయితే మంచిదే! అట్లాంటి సులభసాధనం కావాలి. సాధారణంగ ఆకలి వేసే వానికే పెట్టిన ఆహారం సార్థక మవుతుంది. వానికే అది రుచిస్తుంది తప్ప. కడుపునిండిన వానికి పెట్టే ఆహారం విషమిస్తుంది. మనం పెట్టకున్నా, ఉంది కదా అనుకుని కడుపునిండినవాడు ఆశతో తిన్నా వానికది ప్రమాదిస్తుంది కద! అలాంటి భోజనప్రియులనుండి ఆహారాన్ని దూరంగా ఉంచాల్సి ఉంటుంది, వాళ్ళ శ్రేయస్సును కోరేవారికి.

అట్లే అర్థపంచకజ్ఞానము పొందాలన్న కోరిక లేనివారి నుండి దూరముగ ఉంచి, పదిమంది వింటున్నారు. కనుక, మనమూ విందాం! పోనీ ఏమి నష్టము అంటూ సరదాగ వినేవారుగ కాకుండా అది తెలియక నిలువలేమన్నంత ఆర్తి, త్వర కలవారికి మాత్రమే, అయోగ్యులు చెవినపడకుండా, ఉపదేశించదగినది కనుక ఆ సాధనమును ‘రహస్యం’ అంటారు.

ఇక ఈ రహస్యాన్నందించే వారు గూడ, ఏదో, తనని నమ్మి యిందరు వచ్చారు కనుక, తనకి తోచినదే చెప్పి, తన పబ్బం గడుపుకుందామని కాని, నోరుంది కనుక ఏమి చెప్పినా చెల్లుతుందని కానీ, అదీకాక తనంతట తానే సంపాయించిన స్వయంగ ఒకదానిని సృజించి చెప్పేవాడుకాని, అదీకాక తనంతటతానే సంపాయించిన స్వయం ఆచార్యత్వం కలవాడైకాని ఉండరాదు. సకలశాస్త్రముల సారాంశములను, పరంపరాగతముగ పెద్దలనుసరించిన మార్గంలో నుండి వచ్చినవాడై, వారి ఉపదేశములవల్ల శాస్త్రార్థసారమును గ్రహించినవాడై, తనకు తెలిసిన మంచినంతనూ, ఆశ్రితులకు, బుద్ధిమంతులయిన వారికి చెప్పి, వారిచే ఆచరింపజేయువారై ఉండాలి. ఇన్నీ ఉండి చెప్పేదేదో చెప్తూ, తాను మరేదో చేసేవారు కారాదు. తానుకూడ స్వయంగ చెప్పి, చేయించే దానినే ఆచరించు శీలం కలవారై ఉండాలి. అంటే జ్ఞానము, జ్ఞానమునకు తగిన ఆచరణ, కలవారై ఉండాలి. అనగ పరంపరాగతమైన సదాచార్యత్వం కలవారన్నమాట.

ఆచినోతి హి శాస్త్రార్థాన్, ఆచారే స్థాపయత్యపి| స్వయం ఆచరతే యస్మాత్ తస్మాదాచార్య ఉచ్యతే|| అని అట్టివారినే ఆచార్యులంటారు. వారు పైన తెలిపిన రహస్యములను తెలుపుతారు.

ఉభాభ్యామేవ పక్షాభ్యాం యథా ఖే పక్షిణాం గతిః| తథైవ జ్ఞాన కర్మభ్యాం బ్రహ్మణి జ్ఞానినాం గతిః|| “రెండురెక్కలతో ఆకాశమందు పక్షి సంచరించునట్లు, జ్ఞానము, దానికి తగిన అనుష్ఠానమనే రెంటిపట్ల జ్ఞానులు భగవంతునియందు రమించుచుందురు” అనిన్ని తెలుపుతున్నాయి ప్రమాణాలు.

దీనివల్ల చెప్పేమాట ఒకటి, వేసే వేషమొకటి, మనసులో తలచేదొకటి అనే త్రికరణశుద్ధిలేనివారు ఆచార్యులనే పేరుకు తగరని తెలుస్తోంది. త్రికరణములకు ఏకరూపత కలవారినే మహాత్ములంటారని భర్తృహరి కూడా చెప్పెను. అర్థాత్ సదాచార్యులు త్రికరణశుద్ధితో తనను కోరినవారియొక్క శ్రేయస్సును కోరి పూర్వులు తెలిపిన, సకల శాస్త్ర సారాంశమయిన రహస్యములను సులభముగ మనకు తగిన రీతిలో ఉపదేశిస్తే మనం దానిని గ్రహించి మాత్రమే తరించు అవకాశం ఉంది.

మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం సదాత్మనామ్| మనస్యన్యత్, వచస్యన్యత్, కర్మణ్యన్యత్ దురాత్మనామ్|| త్రికరణములలో ఒకే లక్ష్యమున్నవారు సత్పురుషులు. అదిలేని వారిని దుర్మార్గులందురు. ఇట్టివారివల్ల లోకులు ప్రమాదమునే పొందుతారన్నమాట కద! మరి సదాచార్యులను గుర్తించడమెట్లా? ఆచార్యులనే పేరుకలవారందరినీ మనమాశ్రయించవచ్చా? పై పై ఆకారాలను, వేషాలనుబట్టి ఆచార్యులను గుర్తించుట దుశ్శకము. మరిక ఏమి మార్గము? దీనికి మన పూర్వాచార్యులు మంచిమార్గమును ఉపదేశించారు. ‘కర్మణాజ్ఞాన మనుమీయతే’ అన్నట్లు ఆయా వ్యక్తులు, ఆయా సందర్భాలలో, జేసే ప్రవర్తనను చూచి వారి వారి జ్ఞానమును ఊహించి, ఆశ్రయించవలెనట. పరిమళమునుబట్టి పుష్పాన్ని గుర్తించినట్లు, ప్రకాశమును బట్టి దీపాన్ని గుర్తించినట్లు సదనుష్ఠానమును, సదాచారమునుబట్టి వ్యక్తియొక్క జ్ఞానమును ఊహించి, పెద్దలద్వారా తెలుసుకొని అపుడు సదాచార్యుల నాశ్రయించాలని నిర్ణయం. అట్టివారు మనలను ఉజ్జీవింపజేసే సాధనమును ఉపదేశించగలరు.

ఏదా సాధనం? ఎవరా ఆచార్యులు? సరి. ఆచార్యులను గుర్తించడానికి ముందు మనవద్ద శిష్యలక్షణాలు ఉండాలిగద! ఉన్నవా? కాస్త పరిశీలించుకోవాలి. లోకంలో, పదిమందికీ హితోపదేశం చేద్దామనే కోరిక కలవారే ఎక్కువగ కనిపిస్తారు తప్ప, మనమూ తెలుసుకుందామనే భవ్యత, శిష్యరికం చేద్దామనే కోరిక కలవారు లభించడం చాల కష్టం. ఆచార్యత్వం అందరూ కోరుకుంటారు. ఇతరులను ఆశ్రయించి ప్రమాణబద్ధమైన విషయం తెలుసుకోగోరువారు చాల అరుదు. అందుకనే లోకులలో బోధకులు అధికమై చివరకు ఎవరికి తోచినది వారు చెప్పడం ప్రారంభించి, ప్రమాణము, ప్రమేయం లాంటి వాటికి ఏమాత్రమూ బద్ధులై ఉండకుండానే ప్రవక్తలై లోకానికి బోధకులుగకాక బాధకులుగ తయారై సంచరించడం చూస్తున్నాం. అంటే శిష్యుడుగ ఉండాలంటే కూడా అతనికి కొన్ని యోగ్యతలు ఉండాలన్నమాట. సదాచార్యుడు లభించడం ఎంత కష్టమో సచ్చిష్యుడు లభించడం అంతకంటే దుర్లభమన్నమాట. శిష్యుడంటే ఇలా ఉండాలట కనీసము:-

సద్బుద్ధి కలిగినవాడు, సత్పురుషులను ప్రీతితో సేవించువాడు, పెద్దలు ఆలోచించిన మార్గములోనే తానూ ఆచరించు శీలము కలవాడు, నిజమైన శాస్త్రసారమైన తత్వములను గూర్చి తెలుసుకోగోరువాడై ఉండాలే తప్ప, తనకు తోచిన దానిని ప్రమాణరహితంగ వాదించువాడు కారాదు. పెద్దలు, ఆచార్యులు చేయు ఉపదేశములను వినుటయందు ప్రీతికలవాడై ఉండాలి. దీనిని ‘శుశ్రూష’ అంటారు.

ఇది తెలిసినదేననే విసుగు లేనివాడై ఉండాలి. ఎవరేమి అహితం పలికినా, తననే ఒక్కొక్కసారి నిందించినా, కోరినది తెలుపక ఆలస్యం చేసినా, లేక ఏ పనిచేయ ఆజ్ఞాపించినా, ‘నేనీపని చేయడమా?’ అంటూ అభిమానించక అహంకరించక ఉండాలి. పెద్దలతో భగవానుని సేవించినపుడు సాష్టాంగము నమస్కరించగలవాడై ఉండాలి. పెద్దలుపదేశించు ప్రవచనములు వినునపుడు తనకు కలిగిన సంశయములను సమయం చూచి ప్రశ్నించదగిన రీతిలో, ఆవలివారికి నొప్పి కల్గించనిరీతిలో, తనకు నిజంగ తెలుసుకోవాలనే జిజ్ఞాసవున్నదని తెలియురీతిలో అడుగగలిగి వుండాలే తప్ప, ‘పోనిద్దూ! యిది తెలియకపోతే యిప్పుడేమి మించిపోయింది కనుక!’ అంటూ ఉదాసీనుడై వుండరాదు. ఇట్లు ప్రశ్నించుటకు ‘పరి ప్రశ్న’ అంటారు. ఆచార్యులు ఎన్ని పరీక్షలు పెట్టినా వాటినన్నిటిని ధైర్యంగ ఎదుర్కొనగలవాడు, మంచిధీరుడు అయి వుండాలి. అంటే చెప్పినవి విని అంతర్భావములను గుర్తించగలవాడై వుండాలి. బాహ్యేంద్రియములను మనస్సును తన చెప్పుచేతలలో కలిగివుండాలి.

ఇతరుల అభివృద్ధి చూచి ఓర్వలేనితనమనే ‘ఈర్ష్య’ను వదలాలి. మంచివారి గుణములను విని, వాటిని యదార్థముగ గుర్తించికూడ దోషములేనని నిందించు అసూయలేకుండా వుండాలి. ఆచార్యుల యందు పూర్తిభారము నిలిపి వుండాలి. వేదాది శాస్త్రములయందు విశ్వాసము నిశ్చలముగ వుండాలి. పూర్ణమైన శాస్త్రములసారమైన విష్ణువునందు చలించని భక్తి కలిగి వుండాలి. ఇంకా తనలోని యోగ్యతలను, గొప్పతనములను ఎక్కడపడితే అక్కడ ఎవరితోపడితే వాళ్ళతో, దొరికినదే అవకాశంగ వెళ్ళబోసుకొనే వాడు కారాదు. పైగా గంభీరమైన హృదయం కలవాడు కావాలి. మరియు ఆచార్యాజ్ఞకై ఏమైనా చేయ సిద్ధమైనవాడై వుండాలి. పొందిన మేలును మరువని కృతజ్ఞుడై వుండాలి. ఇంకా... ఇంకా... ఇన్ని యోగ్యతలుంటే ఆతనిని శిష్యుడుగ గుర్తించవచ్చని మన పెద్దలు తెలియచేస్తారు. ఇవన్నీ లోకంలో వుండటం ఎంత కష్టం? అందునా ఈనాటి మనకి ఉండటం మరీ దుర్లభం కద!

అర్థాత్ ఇటు ఆచార్య లక్షణాలు లోకంలో కొఱవడ్డాయి. అటు శిష్య లక్షణాలు మృగ్యమైపోయాయి. కనుక అడిగేవారు లేరు. చెప్పేవారంతకంటే లేరు. యిలా తెలియదగిన ఉపదేశము వల్లనే పొందదగిన ఆధ్యాత్మిక జ్ఞానాన్నందించి, అర్థపంచక జ్ఞానాన్ని కలుగజేయు శాస్త్రసారములలో రహస్యములు లోపించిపోవడం చూచిన భగవానుడు ఒకనాడు తానే ఆచార్యుడై, తానే శిష్యునిగకూడ రూపుదాల్చి హిమగిరి శిఖరాలలో పర్వతరూపుల దాల్చి తాను నారాయణుడై, తన అంశయైన నరుని శిష్యునిగ స్వీకరిస్తూ తన అంశయైన నరుని శిష్యునిగా స్వీకరిస్తూ ఒక రహస్యమును ఉపదేశరూపంగ లోకములో ప్రకాశింపజేసారు. మనందరి హృదయగుహలలో ఉండి సంకల్ప వికల్పములన్నీ చేయించువాడు తానే కనుక మన కోరికను, ఎఱింగి, మన ప్రాపంచిక విషయానుభవ లోలుపతను గుర్తించి, ఆ భగవంతుని మనమంతా గుర్తించేట్లు మనలోని నిత్యానందసౌధవిహార వాంఛను పరికించి, ఎక్కువ శ్రమపడలేమని తెలిసి, సకల శాస్త్రాలు యిమిడేట్లుగ సూక్ష్మరూపంలో, ఉండేట్లు 8 అక్షరములుకల అద్భుతమైన అర్థములను తెలిపే ఒక రహస్యాన్ని అందించాడు. “వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః” వేదములచేతనే నేను తెలియచేయబడుదును. వేదములన్నింటిచేత జీవులను, ప్రకృతిని శరీరంగకల నేనే తప్ప వేరొక తత్వము తెలియజేయబడదగినది లేదు. నన్ను తెలుపుటచేతనే వేదములకు వేదత్వము సిద్ధించుచున్నది అని భగవద్గీతలో స్వయంగ తెలిపి ఉండటం వల్ల

వేదాక్షరాణి యావన్తి పఠితాని ద్విజాతిభిః| తావన్తి హరినామాని కీర్తితాని నసంశయః|| విప్రోత్తములు పఠించు వేదరాశిలోని ప్రతి అక్షరాక్షరము గూడ సర్వపాపహరుడు, దయామయుడునగు శ్రీ మహావిష్ణువును కీర్తించునవే సుమా! అంటూ ఋషులు కూడా ఏకకంఠముతో సర్వవేదసారమైన భగవంతుని కీర్తించి ఉండటంవల్ల అన్ని వేదములయొక్క సారతమమైన అర్థమును 8 అక్షరములలో ఇమిడ్చి యివ్వగల సామర్థ్యము అతనికొక్కనికే ఉన్నందువల్ల తానే స్వయంగ ఆచార్యుడై అవతరించి ఆ 8 అక్షరముల రహస్యాన్నీ లోకంలో ప్రకాశింపచేయవలసి వచ్చింది. 8 అక్షరములు కలది కనుక దానిని ‘అష్టాక్షరీ’ అని అంటారు.

నేలమీద దీపము కొంతమేరనే కాంతినిచ్చి, చీకటిని తొలగించును. నింగిలోని దీపాలు నేలనంతా కాంతివంతం చేస్తాయి గద! అలాగే నేలమీద ఉండి ఆ రహస్యమును ఉపదేశిస్తే కొందరికే తెలుస్తుంది. కొండపైకెక్కి ఉపదేశిస్తే భువనాలన్నీ ఆ ‘అష్టాక్షరీ’ యొక్క శక్తివల్ల జ్ఞానపూర్ణములై అజ్ఞానమనే చీకటి నుండి దూరములవుతాయని తెలిసినవాడు కావటంవల్ల తాను పర్వతములకంటే ఎత్తైన హిమాలయమనే పర్వతరాజము నధిరోహించి రహస్యరాజమైన ‘అష్టాక్షరి’ని ఉపదేశించినాడు. ఈ సులభమైన ‘అష్టాక్షరి’ ఒక్కసారి తలచినంతనే తలచినవారి కష్టములనుబాపి, యిష్టములను యిచ్చే శక్తిగలదిగా గుర్తించిన మన ఋషులు దీనిని ‘మంత్ర’మనిరి. మన్=తలచినదానిని; త్ర=రక్షించునది. లోకంలో ఈ ‘మన్త్రము’లనే పేరుతో పిలువబడేవి చాల ఉన్నాయి. కాని వానికి వేనికీ లేని అత్యద్భుతమైన శక్తి ఒక్క అష్టాక్షరీకి మాత్రమే ఉండటం వల్ల దానిని ‘మంత్రరాజము’ అనిరి.

ఋచో యజూంషి సామాని తథైవాథర్వణానిచ| సర్వమష్టాక్షరాన్తః స్థం ఏతదన్యన్నకాచన|| ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలన్నీ అష్టాక్షరీ మంత్రమునందే అంతర్భవిస్తాయి. దానికి కారణం అవన్నీ కలసి ఎంత అర్థాన్ని తెలియజేస్తాయో, అంతకంటే మించిన అర్థమును ఒక్క అష్టాక్షరీ మంత్రమే తెలుపగలదు. వాటి అర్థాన్ని గ్రహించడానికవసరమైన శ్రమలేమీ దీని అర్థమును గ్రహించడానికవసరం లేదు అంటూ ఋషులు దీనిని స్తుతించారు.

వేదాలన్నింటికీ కూడా ఈ అష్టాక్షరీయే మూలము కనుక దీనిని ‘మూలమన్త్ర’మని గూడ ప్రస్తుతించారు. ఇది కలిగించు జ్ఞానము ‘సనాతన’మని కూడ తెలిపిరి. సనాతనమనగ, ఎల్లప్పుడూ నశించక నిలిచే శాశ్వతమైనది అని అర్థం.

మంత్రాణాం పరమోమంత్రః గుహ్యానాం గుహ్యముత్తమమ్| పవిత్రాణాం పవిత్రం చ మూలమంత్రః సనాతనః|| మంత్రాణాం పరమో మంత్రః మంత్రం అంటే మననం చేస్తే రక్షించేది. ద్రష్టలయిన ఋషుల చేత దర్శింపబడి వ్యక్తమైనవి మంత్రాలు. ఆ మంత్రాలకి శబ్దశక్తి మాత్రమే ఉంటుంది. శబ్దశక్తిచేత రక్షిస్తాయి. ఆ మంత్రాలలోని శబ్దాలను మాత్రమే మననం చేస్తారు. అలా కాకుండా అర్థాన్ని కూడా మననం చేయడానికి అవకాశమున్న మంత్రం మూలమంత్రం. ఇది శబ్దశక్తిచేతనూ రక్షిస్తుంది. అర్థాన్నీ మననం చేస్తే ఆరు విధాలయిన ఆత్మదోషాలని దూరంగ పరిహరిస్తుంది ఈ మంత్రం. అందుచే ఈ మంత్రము మంత్రములలో పరమమైన మంత్రం. అంటే దీనికంటే పరమైన మంత్రం వేరేలేదు.

గుహ్యానాం గుహ్యముత్తమమ్ గుహ్యమంటే రహస్యము. రహస్యమంటే ఆరు చెవులకి అందకూడనిది. అంటే ఇద్దరిమధ్య ఉండేది. ఆచార్యులు శిష్యులకు ఉపదేశించవలసినదికాని సదస్యముకాదు. దీనిని రహస్యముగా ఉపదేశముపొంది రహస్యముగా దాచి ఆదరముతో అనుసంధించాలి. నిధి లభించినవాడు ఆ నిధిని పొందినవాడు దాని విలువ నెరిగినవాడు దానినెట్లు ఒకరికి తెలియకుండా దాచుకుంటాడో అలాగే మంత్రంయొక్క వైభవాన్ని ఎరిగినవారు దీనినెంతో గొప్పగా భావిస్తారు. ఎవరికీ వినపడకూడనిదై భగవద్ రామానుజులు అందరికీ చాటేరంటారు గద! అలా ప్రకాశింప చేయవచ్చునా? అని సందేహం కలుగుతుంది. అంటే దాని విలువ ఎరిగి ప్రవర్తించాలి అని అర్థం.

అట్లా విలువ గలిగి దాచవలసిన వాటితో ఇంతకుమించినది లేదు. లోకములో నశ్వరములైన ధనధాన్యాదులని, క్షుద్రమైన శరీరానికి వచ్చిన వయస్సునే ఒకరికి చెప్పకుండా దాచుకుంటారు. అలాంటిది ఆత్మజ్ఞానాన్ని ఎంత రహస్యంగా దాచాలి. విలువ నెఱుగనివారికి, అసూయాగ్రస్తులకు కంటపడకుండా కాపాడాలి. ఆదరం కలవారికి, ఆప్తులకు అందించాలి. అందుచే ఇది రహస్యములలో ఉత్తమమైన రహస్యము.

పవిత్రాణాం పవిత్రం శరీరానికి, ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి మాలిన్యాలు అంటుతుంటాయి. శరీర మాలిన్యాన్ని శౌచంచేత శుద్ధి చేసుకొంటారు. ఇంద్రియాల మాలిన్యాన్ని విషయనియమంచేత, మనోనిగ్రహంచేత తొలగించుకొనేందుకు ప్రయత్నిస్తారు. మనోమాలిన్యాన్ని ప్రాణాయామ, ప్రత్యాహారాదులచేత శుద్ధిచేసుకొంటూ ఉంటారు. బుద్ధిమాలిన్యాన్ని శాస్త్రజ్ఞానం చేత తొలగించుకొంటారు. శుద్ధిని కల్గించే సాధనాన్ని పవిత్రం అంటారు. ఈ పవిత్రతను కల్గించే సాధనాలకు ఉత్తమమైన సాధనం తిరుమంత్రము. దీనిని ఉపదేశం పొంది అర్థాన్ని ఎఱింగి మననం చేసిన, వారి ఇంద్రియ, మనో, బుద్ధిమాలిన్యాలు పోగొట్టడమే కాకుండా ఆత్మకంటిన అవిద్య, కామకర్మ రుచి వాసనాది మాలిన్యాలను తొలగిస్తుంది. స్వస్వరూపాన్ని, భగవత్ స్వరూపాన్ని ప్రకాశింప చేస్తుంది. మాలిన్యాలను తొలగించి ప్రకాశింపచేసిన పవిత్రమైన వానిలో పవిత్రమైనది.

“మూల మంత్రః” ఇది మూలమంత్రము. మూలమంత్రమనగా మంత్రములకు మూలము అని అర్థము. దీనినుండే సర్వమంత్రములు ఆవిర్భవించాయి. వేదముయొక్క సంగ్రహరూపం ప్రణవమైతే, ఆ ప్రణవముయొక్క వివరణ ‘నమో నారాయణాయ’ అనే ఏడు అక్షరాలని చెప్తారు కాబట్టి సర్వవేదకారణము ఈ మంత్రము. మూలమనగా జగత్కారణము. ‘కారణం తు ధ్యేయః’ కారణత్వాన్ని ధ్యానం చేయాలి. ఆ కారణత్త్వాన్ని ‘మూల’ అని పిల్చాడు గజేంద్రుడు. పిలిచి ఎదురుగావస్తే “నారాయణ” అని నమస్కరించాడు. అంటే మూలము నారాయణుడు. అష్టాక్షరీ మహామంత్రము మూలమైన కారణత్వాన్ని ధ్యానం చేసే మంత్రము. అందుచే ఇది మూలమంత్రము. ఇది కారణ తత్త్వాన్ని ధ్యానం చేసే మంత్రం కనుక మూలమంత్రము.

“సనాతనః” ఇది సనాతనము. సనాతనమనగా “సదా అస్తి ఇతి” వ్యుత్పత్తి. ఎప్పుడూ ఉన్నది=సనాతనము. అంటే ఇది ఒకరిచేత ఒకనాడు కల్పింపబడినది కాదు, నారాయణుడెట్లా సనాతనుడో ఆయనను ప్రతిపాదించే ఈ మంత్రం సనాతనమే. అందుచేతనే ఆకారానికి నారాయణ శబ్దము వివరణము, అకారము ఎప్పుడూ ఉండే అక్షరము. ‘యో వేదాదౌ స్వరః ప్రోక్తః’ అనే మంత్రంలో అకారము అంటే సర్వరక్షకుడైన, సర్వకారణమైన నారాయణుడు నిత్యమని, ఆ నారాయణ నామములో అకారము, దాని వివరణమే అయిన నారాయణ శబ్దము నిత్యమని తెలుస్తోంది.

కాబట్టి ఈ మంత్రము ఎల్లప్పుడూ ఉండునది కనుక సనాతనము. మిగిలిన మంత్రములకు ద్రష్టలున్నారు. ఈమంత్రమునకు నారాయణుడే ద్రష్ట. అంటే అతనితోబాటు ఉన్నదే, కాని ఒకనాడు ఒకరిచేతను కనుగొనబడినదికాని, ఎవరికో ఒకరికి భగవదనుగ్రహముచే భాసించినది కాదు. నిత్యము, సత్యము, మూలమంత్రము ఇది ధ్యేయ వస్తువయిన నారాయణుని దర్శింప చేయగల సామర్థ్యము కలది. ఇదే జప్యము. జ్ఞేయము. ప్రాప్యము కూడ అంటూ దీని వైభవాన్ని వ్యాసాదులందరూగూడ కీర్తించారు.

ఏతావతా, తెలియదగిన అర్థపంచక జ్ఞానమును మానవులందరికీ అందించడమే ప్రధానలక్ష్యంగ, దానివల్ల మానవులలో ముముక్షువులైన బాగుపడగోరు వారందరికోసమని భగవానుడే స్వయంగ అవతరించి అటు ఆచార్యలక్షణాలను స్వయంగ తెలిపినాడు. ఇటు శిష్య లక్షణాలను లోకంలో ప్రకాశింపచేసినాడు. ఆయనద్వారా మూలమంత్ర బ్రహ్మమైన అష్టాక్షరిని లోకాని కందించాడంటే దానికుండే గొప్పవైభవము, దానిలో ఉండే అర్థగౌరవము మరి దేనికుంటాయి కనుక? ఇదొక్కటి తెలిస్తే అన్నీ తెలిసినట్లే! నదిలోని మనిషికి ఈతవలె. ఇది తెలియనిదే ఎన్ని తెలిసినా వ్యర్థములే, పడవలోని వైజ్ఞానికునివలె ఇది తెలిసినపుడు మిగిలినవన్నీ దీనివల్ల శోభిస్తాయి. లేకుంటే శవాలంకారాలవలె వెగటును పుట్టిస్తాయి.

మరో విశేషమేమిటంటే ఆ మంత్రబ్రహ్మమును మాత్రమే ఉత్తారకమని ద్వైతాద్వైతాచార్యులు ముగ్గురు కూడ గాఢంగ విశ్వసించారు. ఆదిశంకర భగవత్పాదులు, భగవద్రామానుజులు, శ్రీమాధవాచార్యులవారు ఈ మంత్రమునే ఈశ్వర శబ్దవాచ్యమని నిర్ణయించిరి. మంత్రములని పేరు కలవి చాలా ఉన్నాయి. కాని వాటిన్నింటికి లేని అద్భుతమైన శక్తి ఈ మూలమంత్రానికి ఉంది.

ప్రణవము (ఓంకారము) నమః పదము అనే రెంటిని చేర్చి అలా చేర్చిన పదాలనే మన్త్రాలు అంటారు. ఎలాగంటే ‘కేశవ’ అనేది పదం. దానిని ముందు వెనుక పై రెంటిని చేరుద్దాం. అపుడది ‘ఓం కేశవాయ నమః’ అయింది. అలాగే రామ, కృష్ణ, శివ, గోవింద, నరసింహ మంత్రాలన్నీ తయారుచేస్తారు. దానిని ‘ఉపాసన’ చేసి శక్తిని పుట్టిస్తారు ఆ మంత్రానికి. అపుడు వాటితో కొన్నిపనులు చేస్తూ ఉంటారు. ఈ ఓంకారము. నమః పదములేనిదే ‘మంత్రము’ అని అనరు. ఏ మంత్రానికీ కూడా ఇవి రెండూ సహజంగ ఉండవు. శ్రీకృష్ణుడు జైలులో అవతరించినపుడే శంఖచక్రాలతో కలిసే ఎలా పుట్టినాడో, ఎట్లు కర్ణుడు కవచకుండలాలతో సహజంగ జన్మించెనో అట్లే అష్టాక్షరీమంత్రము అవతరిస్తూనే ప్రణవ, నమః పదాలతో అవతరించినది.

ఇది దీనియొక్క యితర మంత్రాలకు లేని అసాధారణ వైభవము. ఉపనిషత్తులే దీని గొప్పతనాన్ని అట్లు కీర్తించాయి. చూడండీ ‘పంచాక్షరి’ అని ఒకమంత్రం ఉంది. అందులో ప్రణవం లేనేలేదు. ‘నమఃశివాయ’ అపుడది మంత్రం అనిపించుకోదు. ఒకవేళ ప్రణవం చేరుస్తామంటే అది ‘షడక్షరి’ అవుతుంది తప్ప పంచాక్షరి అవ్వనే అవ్వదు. అట్లే మిగిలినవన్నీ, కాని ఒక ఉపనిషత్తు ప్రత్యేకించి అష్టాక్షరీ మంత్ర సంఖ్యా నియమాన్ని అక్షర విన్యాస క్రమాన్ని ఉపదేశించింది.

ఓమిత్యగ్రేవ్యాహరేత్, నమ ఇతి పశ్చాత్, నారాయణా యేత్యుపరిష్టాత్ ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం ‘ఓం’ అని ముందు పలుకవలెను. ‘నమః’ అని ఆపై పలుకవలయును. దాని పిదప ‘నారాయణాయ’ అని ఉచ్చరించవలెను. ఇదే అష్టాక్షరీ మంత్రమును పలుకు క్రమము అంటుందా ఉపనిషత్తు. దానివల్ల మిగిలిన మంత్రాలవలె నమః పదం చివర ఉండదు. మధ్యలో ఉంటుందన్న మాట. కనుకనే ‘ఓం నారాయణాయ నమః’ అనే అనవలెను అని వివరిస్తోంది. ఇట్లే ఆపై అనువాక్యంలో ఏఏ పదాన్ని ఎలా పలకాలోగూడ నిర్ణయించిందీ ఉపనిషత్తు.

ఓ మిత్యేకాక్షరం, నమ ఇతిద్వే అక్షరే, నారాయణేతి పంచాక్షరాణి. ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం ‘ఓం’ అనేది ఒక అక్షరము. నమః అనేది రెండక్షరములు, ‘నారాయణాయ’ అనేది ఐదక్షరములు. 1+2+5 మొత్తం ఎనిమిది అక్షరములు కలదీ మంత్రము అని ఆ ఉపనిషత్తు సిద్ధాంతము చేసిపెట్టినది. ఈ ఘనత యితర మంత్రములకు వేనికిలేదు. అదీగాక మంత్రత్వము ఈ అష్టాక్షరికి పూర్ణముగ కలదని మన ఋషులయొక్క అభిమతము. ఎట్లా?

‘మన్+త్ర’ అనగ తలచిన వానిని రక్షించునది అని గద అర్థము! రక్షించుట అనగ కోరిన ఇష్టములను కూర్చుట, తగని అనిష్టములను బాపుట అని అర్థం. అంటే ఎవరెవరికి ఏమేమి కావాలో తెలుసుకొని వారికి వాటినన్నింటిని తొలగించేటంత శక్తి కూడ ఉండాలి. ఇది ఒక్క అష్టాక్షరికే కలదు. లోకులలో అందరికీ ఈ ఇష్టానిష్టాలు ఒకేరకముగ ఉండవు.

ఒక్కొక్కనికి ఒక్కొక్కరకంగ ఉంటాయి. డబ్బు కోరేవానికి అది దొరకడం ఇష్టం. దానిని రాకుండా చేసే వారు అనిష్టం. వీరు తొలగాలి. ధనం కావాలి అది యిస్తే వాని రక్షణ జరిగినట్లన్నమాట. అట్లే కొందరు ఇంద్రియాలకు ఆహారం, మరికొందరు బంధువులు, యింకొందరు, భవనాలు, మరికొందరు బంగారం, అన్యులు భోజనమును, ఇట్లే కోరికలు మారతాయి గద!

పైగ మరి కొందరు కర్మయోగాన్ని సాధించాలనుకుంటారు. వారికి ఇష్టమేమిటంటే కర్మయోగం సిద్ధించడం. వారికి అనిష్టమేమిటంటే కర్మయోగనిష్పాదనకు ఆటంకమగు పాతకములు, ఆటంకములు అన్నీ తొలగిపోవటం, వేరేకొందరు జ్ఞానయోగం, మళ్ళీ వీరికి ఇష్టాలు వేరు అనిష్టాలు వేరు.

కొందరు భక్తియోగం కోరచ్చు వారి ఇష్టానిష్టాలు వేరు వేరు. కొందరు స్వర్గం, మరికొందరు ఇంకొకటి ఇంకొకటి, ఇలా... ఇలా... అసలు కొందరు భగవత్సేవను కోరవచ్చు. వారికి ఇష్టం నిరంతర భగవత్సేవ, వారికీ అనిష్టములుంటాయి. అవి సేవలో మధ్య కలిగే ఆటంకాలు, అవి వారికి తొలగాలి.

ఇలా చిన్నజీవి నుండి బ్రహ్మవరకు ఉండే జీవులందరికీ ఇష్టానిష్టాలుంటాయి. ఇతర మంత్రాలన్నీ ఏవో కొన్ని కొన్నింటిని మాత్రం యివ్వగలవు తప్ప భౌతిక సుఖాల నుండి మొదలు పెడితే, పరమపద ఐశ్వర్యందాకా యివ్వగలిగిన మంత్రాలేవీ లేనేలేవు ఒక్క అష్టాక్షరీ తప్ప అనేది తిరుగులేని సత్యమని ఋషులంతా నిర్ణయించారు.

అందుచే మిగిలినవాటిని, సోపాధికమంత్రాలంటారు. ఇదొక్కటే పరిపూర్ణముగ “మంత్ర” శబ్దముతో చెప్పడానికి తగును. అదీకాక మిగిలిన ఏ మంత్రాలు జపించేవారైనా, తమ మంత్రాలతోపాటు ఈ అష్టాక్షరీని కూడ వాటి చివర చేర్చి ఉపాసనచేస్తే ఆ మంత్రాలని త్వరగ ఫలింపజేసే అమోఘమైన శక్తి ఒక్కదీనికే ఉంది. దానికి కారణం ఈ మంత్రములో ప్రతిపాదించబడే “నారాయణు”ని శక్తి విశేషమన్నమాట.

సకల జీవులకు లోనుండి నడిపే వాడాతడేగద! అట్లే ఏ మంత్రముచే చెప్పబడే దేవతలయినా ఫలితాలను వేటినయినా యిస్తున్నాయంటే అదివాటి ఘనత కానేకాదు. భగవద్గీతలో 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడే దానిని స్వయంగ తెలిపినాడు.

స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధన మీహతే| లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్|| ‘ఆయా దేవతలను శ్రద్ధగా ఆరాధించే బుద్ధి నేనే యిస్తాను. ఆయా ఆరాధనలతో తృప్తుడనై ఆయా దేవతలో ఉండి నేనే కోరిన... ఇష్టములను యిస్తాను కనుక వాడు వాటిని లభించుచున్నాడు’ అనెను. అపుడు అదీ మంచిదేగా అనిపించవచ్చు.

కాని తిరిగి 9వ అధ్యాయంలో వానికి నాస్తికత కలగకుండుటకై అట్లు అన్యుల ద్వారా నన్ను చేరినవాడు, వాని కోరికలు తీర్చితినేగాని స్వయము, నేరుగనన్నే ఆరాధిస్తే నాకింకా ఆనందం కలిగి ఉండేది. అపుడు వానికి అంతకంటే యింకా మంచి మంచి అనేక ఫలితములను యిచ్చి ఉండేవాడిని. కాని ఏం చేయను? నన్ను నా సౌలభ్యాన్ని గుర్తించడం చేతకాలేదు వీనికి. అలా నేనిచ్చే వాటిని ఇతరుల ద్వారా గ్రహించడం నాకు అనిష్టం.

“అవిధిపూర్వకం” అని భ.గీ. 12. అధ్యాయములో అంటాడు. దేవతలంతా యివ్వగలిగినవన్నీ యిప్పించేవాడు తానే అయి, అవన్నీ, తానొక్కడే యివ్వగల ఫలితాలను యివ్వడంతో పాటు, అవేవీ ఈయలేని మోక్షాన్ని కూడా యీ మంత్రం యివ్వగలదు.

మరో విశేషంగూడ. మిగిలిన మంత్రాలన్నీ కేవలం శబ్దశక్తిచేతనే కొంతవరకైనా రక్షిస్తాయి. అంటే ఇన్నివేలసార్లు ఇన్ని లక్షలసార్లు జపిస్తేనే దానికీ నియమాలున్నాయి. దానికి తక్కువైతే అవి ఫలించవు. అంటే కరెంటు పుట్టించడానికి ఈ రోజులలో జనరేటరులను మనం వాడుతున్నాం. దానిని ఎంత త్రిప్పితే అంత కరెంటు పుడుతుంది. మనం త్రిప్పడం ఆపేస్తే కరెంటు పుట్టనేపుట్టదు.

అంటే తాను స్వయంగ అచేతనం. కనుక ఫలమును పుట్టించడంలో చైతన్యం కలిగిన మన మీద ఆధారపడుతూ మనలో శక్తిలేకపోతే, అదిచ్చే కరెంటుకూడా లోపభూయిష్టంగానే ఉంటుంది.

అట్లే యితర దేవతలను తెలిపే యితర మంత్రాలన్నీ గూడ, అవి స్వయంగ మంత్రత్వం లేనివి కనుక, అచేతనాలు కనుక ఉపాసకులయిన జీవులు చేసే ఉపాసనను బట్టి ఫలిస్తాయి.

ఉపాసన బాగ చేస్తే మంచిఫలితం. కొంతసరిగా చేయకపోతే లోపం. ఏదైనా తప్పు జరిగితే, అది పొరబాటుగనో గ్రహపాటుగనో కావచ్చు. ఆ ఉపాసకుడి గతియిక అంతే! అతను బ్రహ్మరక్షస్స్వరూపం దాల్చడమో, లేక భ్రష్టుడైపోవడమో జరుగుతూ ఉంటాయి. ఇది క్షుద్రమంత్రాలన్నిటికి సమానమే!

నారాయణమంత్రం కంటే యితరమైన ఏమంత్రాలైనా సరిగా చేయనినాడు బెడిసికొడతాయట. అయితే వాటిలో ఈ అష్టాక్షరిని చేరిస్తే అలాంటి లోపాలను యిది తీర్చి, వాటిని త్వరగ సఫలపరిచే ఉదారమైన శక్తి దీనికే ఉంది.

మరో గొప్పదనం కూడా చూడండి. మిగిలిన వాటివలె యిది సరిగా చేయకపోయినా బెడిసికొట్టదు. విశ్వాసముంటే ఫలిస్తుంది లేకపోతే కొద్దికొద్దిగ ఉపాసకులలోని పాపాలు కరిగిస్తూ ఉండి పోతుందే తప్ప హానిమాత్రం చేయదు. జీవులకు సహజ బంధువైన నారాయణుడికి చెందినది కదా! అతని ప్రేమవంటి ప్రేమయే దీనికి కూడ.

సాంకేత్యం పారిహాస్యం చ స్తోభం హేళన మేవచ| వైకుంఠనామగ్రహణం అశేషాఘహరం విదుః|| మంత్రముపై నమ్మకంలేని ఎవరికో పేరుగ పెట్టి నారాయణ పదమును పలికినా ఇది పాపములను బాపును, వెక్కిరింపుగ పరిహాసమాడినా ఇది పాపములబాపును లేక ఊతపదంగా అర్థం తెలియకవాడినా, కనీసం నిందించాలని నారాయణ నామము పల్కినా సమస్త పాపములను పారద్రోలునీమంత్రం.

ఏరకంగ పలికినా ఏ ప్రమాదమూ కలుగజేయక రక్షించు పరమసాత్విక మంత్రమీ అష్టాక్షరీ మంత్రము. మిగిలిన మంత్రములన్నీ కేవలము ఉపాసకులు చేసే అక్షరలక్షలు జపము, హోమము, తర్పణము ఇత్యాది క్రమాన్ని బట్టి మాత్రమే ఫలిస్తే ఈ అష్టాక్షరి శబ్దశక్తిచేత, అర్థశక్తిచేతగూడ రక్షించే సామర్థ్యం ఉంది అంటే అక్షరలక్షాత్మకంగ ఉపాసన ఎవరైనా చేసి, దానిలో పదోవంతు హోమం, దానిలో పదోవంతు తర్పణం, అందులో పదోవంతు పుష్పాంజలి, అందులో పదోవంతు తదీయారాధనచేస్తే వారికి కామ్యములను తీర్చే శక్తి దీనికి ఉంది.

అంతేకాక తనలోని అర్థాలను వెలువరిస్తూ గూడ ఈ అష్టాక్షరీ జీవులను దుఃఖములనుండి దూరంచేసి రక్షించును. ఇది ఏ యితర మంత్రాలకీలేదు. ఈ రక్షణ అనేది దేహానికి, ఆత్మకు అని రెండు రకాలు.

దేహానికి వ్యాధుల నుండి రక్షణ కలగడానికి ఎన్నో వైద్యవిధానాలున్నాయి కనుక వాటికోసం మంత్రమవసరంలేదు.

ఇక ఆత్మకు వచ్చే వ్యాధులు కొన్ని ఉన్నాయి. ఇవి మనస్సులో కలిగే అజ్ఞానంవల్ల ఏర్పడతాయి. దానిని తొలగించే సామర్థ్యం వైద్యశాస్త్రానికి లేదు. కేవలం ఈ మంత్రమే కావాలి.

శారీరక వ్యాధులు అపారములు, అనంతములు. వాటి నివారణా పద్ధతులు అనంతములే. కాని ఈ ఆత్మ వినాశకరములగు వ్యాధులను మాత్రం 6 రకాలుగ గుర్తించారు. దానికి నివారణా విధానాలుగూడ ఆరే. ఆ ఆరూ ఈ అష్టాక్షరీలోనే ఉన్నాయి. ఆ వివరణ ఈ స్తోత్రంలోని నాలుగవ శ్లోకంలో గమనించవచ్చు. అనగ ‘శబ్దశక్తి'తో జపాదులుచేసి లభించే రక్షణకంటే అర్థం తెలిసి దానిని మనసారా భావించి ఒక్కసారి మంత్రానుసంధానం చేస్తే మనం పొందే ఫలితం అధికమన్నమాట. కనుకనే అర్థం తెలుసుకొని ప్రీతితో దీనిని అనుసంధించుట ప్రధానము.

ఈ మంత్రబ్రహ్మము భగవానునితో జీవులకు కల తొమ్మిది విధములయిన సంబంధములను స్పష్టపరుచును. అంతేగాదు మంత్రములన్నింటిని మనవారు రెండువర్గములు చేశారు.

మొదటి వర్గం ‘వ్యాపక మంత్రములు’ అంటారు. అనగ భగవానుని సర్వవ్యాపక శీలమును వర్ణిస్తాయి.

రెండో వర్గం ‘అవ్యాపక మంత్రములు’ అంటారు. ఒక్కొక్క అవతారము, ఒక్కొక్క ప్రయోజనమును నేరవేర్చేటపుడు చూపిన ఒక్కొక్క గుణమునుమాత్రమే చెప్పే మంత్రాలన్నమాట. ఉదాహరణకు ‘విష్ణు’ అనే మంత్రముంది.

దీని అర్థం ‘వ్యాపించినవాడు’ దీనిని వ్యాపక మంత్రమంటారు. ‘గోవింద’ అనేది మంత్రం. ‘గోవులను పాలించువాడు, గోపికలను, గోపకులను రక్షించువాడు, లేదా వాక్కులను ప్రసాదించువాడు’ ఇట్లు కొన్ని గుణాలు మాత్రమే తెలుస్తాయి కాని జగత్తంతా నిండిన వాడనే అర్థం రాదు ఇందులోంచి కనుక ఇది ‘అవ్యాపక మంత్రం’ అంటారు.

వ్యాపక మంత్రాలు మొత్తం మూడేమూడు. మిగిలినవన్నీ అవ్యాపకమంత్రాలే. పరిమిత గుణాలు చెప్పే అవ్యాపక మంత్రాలకంటే, అపరిమితమైన ‘వ్యాప్తి’ని చెప్పే వ్యాపక మంత్రాలకే శక్తి అధికమని మంత్రశాస్త్రవేత్తల నిర్ణయం. అవి నారాయణ, విష్ణు, వాసుదేవ మంత్రాలు.

ఈ మూడు వ్యాపక మంత్రాలలోను తిరిగి విష్ణు వాసుదేవ మంత్రాలలో వుండే లోటుపాట్లు నారాయణ మంత్రానికి లేవు. కనుక ఆ రెంటికంటే నారాయణాష్టాక్షరీయే సర్వశ్రేష్టమైనది అంటారు. మిగిలిన రెండింటిలో ఆ వ్యాపించినవాడెవడు? ఎలా వ్యాపించాడు? వ్యాపించినందు వల్ల కలిగే ఫలమేమిటి? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు లేవు. కాని అష్టాక్షరీలో వీటన్నిటికి సమాధానాలుండటమేకాదు. మరిన్ని అర్థాలుకూడ దీనిలో వుండటంవల్ల వ్యాసాది ఋషులంతా దీనినే కీర్తించి ఆదరించారు.

యథా సర్వేషు దేవేషు నాస్తి నారాయణాత్పరః| తథా సర్వేషు మంత్రేషు నాస్తి చాష్టాక్షరాత్పరః|| దేవతలలో నారాయణుని మించిన వారులేరు. మంత్రములలో అష్టాక్షరిని మించినది లేదు.

నారాయణేతి మంత్రోస్తి వాగస్తి వశవర్తినీ| తథాపి నరకే ఘోరే పతన్తీతి కిమద్భుతం?|| నారాయణాష్టాక్షరీ మంత్రముంటుండగ, దానిని పలుకుట, 8 అక్షరములే గనుక చాల సులభం కదా! పలికే నాలుక మనవద్దే పనిచేస్తూ స్వాధీనమందే ఉంది కూడ కద! నరకంనించి మనని ఇది రక్షించేది కూడగద! అయినాసరే ఈ లోకులంతా అలా త్రోసుకుంటూ ఘోరమైన నరకంలో పడిపోతున్నారేమిటి? అంటూ ముక్కుమీద వ్రేలువేసుకున్నాడు యముడు అంతటివాడుగూడ.

ఇది భగవానుడే నారాయణుడై బదరికాశ్రమంలో ఆత్మస్వరూపమును తెలిపెడిదిగ ఉపదేశించుట మాత్రమేగాక దీని అర్థమును మరింత స్పష్టముగ తెలియచేయడానికి పరమపదంలో ద్వయమంత్రాన్నీ సాక్షాత్తు లక్ష్మీదేవికి ఉపదేశించినాడు. ఆమె శ్రీవిష్వక్సేనులకు, ఆయన శ్రీ నమ్మాళ్వారికి అందించారు. ఈ రెంటి అర్థాన్ని మరింత స్పష్టపరుస్తూ భగవద్గీతలో 13వ అధ్యాయపు 64వ శ్లోకంలో అంటే ‘సర్వధర్మాన్’ అనే చరమశ్లోకాన్ని అర్జునునకు ఉపదేశించినాడు.

ఇట్లా ఉపదేశించిన 3 మంత్రాలను మన ఆచార్యులు రహస్యములుగ మంత్రోపదేశ సమయమున అనుగ్రహిస్తారు. ఈ మూడింటిని గూడ మన శ్రీ నమ్మాళ్వారు గ్రహించి శ్రీనాథమునులకు ఉపదేశించారు. వారు శ్రీ ఆళవందారుకి అందించిరి. వారి ద్వారా శ్రీ రామానుజులవారికి అందినవి. వారు తమ తరువాత అనేకులకు వీనిని అర్థములతోపాటు ఉపదేశింపజేసారు.

శ్రీరామానుజులకు ముందు ఒక్కొక్క గురువుగారు ఒక్కొక్క శిష్యునకే జీవితకాలంలో ఉపదేశిస్తే ఉపదేశించేవారు. లేనిచో లేదు. అంటే వారంతా మంత్రంయొక్క విలువను చూచుచున్నారే తప్ప, అది అందక జనులు పడే అవస్థను చూడలేదు. అదైనా స్త్రీలకుకాని సన్యాసులకుకాని, బ్రాహ్మణ పురుషులకుగాని ఈ మంత్రములను వినపడనిచ్చేవారు కాదు.

కానీ, శ్రీరామానుజులవారు శ్రీ వ్యాసాది ఋషుల భావములను, శ్రీకృష్ణభగవానుని ఉపదేశమును బాగుగ ఎఱింగినవారగుటచే ‘ఆర్తి’ ఉండిన చాలునని అందరికీ తరించు సాధనమీ మంత్రత్రయమని ఉపదేశింపచేసినారు. ఆ ఉపదేశము నందుటకు పంచ సంస్కారములనే క్రమమును ఏర్పరచినారు. అదే ఈనాటికి అమలులో వుంది.

ఆచార్యులు దానిని అనుగ్రహిస్తూ... శ్రీరామానుజ సంబంధమును తద్ద్వారా భగవత్సంబంధమునూ కలిగిస్తూంటారు. మరి ఈనాటిదాకా ఈ ఆచార్యులంతా యిలా ఎందరికో ఉపదేశాలు చేసేస్తూవుంటే వీరికి శక్తి ఎక్కడిది? అది లేకుండా వీరు ఉపదేశం చేసే అర్హత ఉన్నవారా? అనే సంశయం కొందరికి కలుగవచ్చు. ఆ సందేహమవసరంలేదు. ఉపదేశం చేసేవారు జపసిద్ధి పొంది వుండాలి.

నిజమే! వీరు చేయలేనినాడు వీరితరఫున ఎవరైనా జపసిద్ధి పొంది వీరికి యిచ్చినా ఫరవాలేదు. అంటే వీరిని జపం చేయవద్దని కాదు కాని, వీరు చేసే దానివల్ల కలిగే ఫలితమెంతో తెలియదు కాని యోగ్యులైనవారు జపించి ఆ మంత్రశక్తిని పెంచుతూ వానికి యిస్తుంటే ఎందరికైనా దానిని అందించవచ్చుగద!

సాక్షాత్తు మొదటగ మంత్రమును ప్రకాశింపజేసిన ఆ నారాయణుడే తన మొదటి శిష్యుడయిన నరునితోపాటు ఆ బదరికాశ్రమంలోనే ఈనాటికీ ఆ అష్టాక్షరీని తపస్సు చేస్తూ కొండలంత ఎత్తుగ, హిమగిరిశిఖరాల్లాగ తన చల్లని కరుణతో జపశక్తిని పండించుతూనే ఉన్నాడు. వానినందించిన శ్రీ నమ్మాళ్వార్ల, శ్రీరామానుజుల పరంపరతో సంబంధం కల వారికి అది ధారగా అందుతూనే ఉంటుంది. ఎందరికైనా దానిని భూరివితరణ చేయొచ్చు. పంటకు లోపంలేదు. అందుకొనే వారిదే కొఱత. ఎందరందుకుంటే ఆ స్వామి కంత ఆనందం. అందుకోవాలంటే రుచికావాలి. రుచి పుట్టాలంటే దాని అర్థం తెలియాలని పరమ కారుణికులయిన శ్రీ కూరత్తాళ్వార్ల కుమారులగు శ్రీ పరాశర భట్టారకులవారు ప్రతిదినమూ అనుసంధించుకొనురీతిలో ఈ అష్టాక్షరీ, ద్వయ, చరమమంత్రాల సారాంశమునంతటిని 8 శ్లోకాలలో యిమిడ్చి మనకందించారు. వాటిని “అష్టశ్లోకి” అని మన పెద్దలంటారు.

విడిగ ఆ మంత్రాల అర్థాన్ని తలచుకోవడం శ్రమసాధ్యం కనుక శ్లోకరూపముగనయితే పాడుకొనుట వీలుండునని వారందించిన ఈ అష్టశ్లోకిని ఆధారం చేసుకొనే ఆ తరువాత శ్రీ పిళ్ళైలోకాచార్య స్వామివారు ‘ముముక్షుప్పడి’ అనే సరళమైన సూత్రములను మంత్రత్రయ వివరణాత్మకంగ రచించారు. శ్రీ మణవాళ మహామునులు వానికి తమయొక్క సహజమైన విశదతమైన వ్యాఖ్యానము ద్వారా సౌరభాన్ని గూర్చారు. ఈపైన తెలిపిన వైభవాలన్నీ శ్రీమణవాళ మహామునులు తమ ముముక్షుప్పడి వ్యాఖ్యానములలో వివరించిన వాటిలో కొన్నిమాత్రమే ఆ వ్యాఖ్యానములు పఠించుట యందు రుచికలుగు నిమిత్తము ప్రరోచనగ ఈ ‘అష్టశ్లోకి’ని ముముక్షువులకోసమని అందించదలచిన ‘శ్రీరామానుజవాణి’ యొక్క సత్సంకల్పము మిగుల ప్రశంసనీయము. దీనిని శ్రద్ధాళువు లందరూ అనుసంధించుకొనుచు తమ శ్రేయోభిలాషులచేత అట్లే తాము శ్రేయస్సునాకాంక్షించు పిన్నలచేతగూడ అనుసంధింపజేసి ఆచార్య, భాగవత కటాక్ష పాత్రులగుదురుగాక!

మంత్రమునందు, మంత్రమును అనుగ్రహంతో ఉపదేశము చేసే ఆచార్యులయందు, మంత్రమందు ప్రతిపాదించబడే భగవానునియందు సమానముగ విశ్వాసముంచినచో తప్పక మంత్రము ఫలించును. మనలను తరింపజేయును.

మంత్రే తద్దేవతాయాంచ తథా మంత్రప్రదే గురౌ| త్రిషు భక్తి స్సదాకార్యా సాహి ప్రథమ సాధనమ్|| అని ఆర్యోక్తి.

ఈ మంత్రముయొక్క వైభవము నెరింగి, దానిని మన కందించుటలో ఆచార్యులు చూపిన ఔదార్యమును గుర్తించి ప్రేమతో, ఆదరముతో ఈ మంత్రార్థసారమగు అష్టశ్లోకిని అనుసంధించుకొని భగవద్బంధువులమంతా తరిద్దాము రండి.